ఇక్కడా అదే పంచాయితీ!

ABN , First Publish Date - 2021-02-27T05:35:10+05:30 IST

నందికొట్కూరు వైసీపీలో మరోసారి సీట్ల పంచాయితీ ఉత్కంఠగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల అభ్యర్థుల వ్యవహారం అధినాయకత్వం వద్దకు చేరింది.

ఇక్కడా అదే పంచాయితీ!

  1. అభ్యర్థుల ఎంపికలో ఆర్థర్‌ వర్సెస్‌ సిద్దార్థరెడ్డి
  2. అధినాయకత్వం వద్దకు మున్సిపల్‌ రాజకీయం
  3. రెండు వర్గాల నుంచి వార్డు అభ్యర్థుల పేర్లు 
  4. ఎవరికెన్ని వార్డులు కేటాయిస్తారోనని ఉత్కంఠ 


నందికొట్కూరు, ఫిబ్రవరి 26: నందికొట్కూరు వైసీపీలో మరోసారి సీట్ల పంచాయితీ ఉత్కంఠగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల అభ్యర్థుల వ్యవహారం అధినాయకత్వం వద్దకు చేరింది. గతేడాది జిల్లా పరిషత్‌ ఎన్నికల నుంచి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, పార్టీ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య బీ ఫారాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికల్లోనూ అత్యధిక పంచాయతీలు తమకంటే తమకు కేటాయించాలని పోటీ పడి మంత్రుల సమక్షంలోనే గొడవకు కూడా దిగారు. ఇద్దరి మధ్య సయోద్య కుదరక ఎమ్మెల్యే ఆర్థర్‌, సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గాల అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడ్డారు. పంచాయతీ ఎన్నికలు ముగియడం, మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మళ్లీ బీ ఫారాల పంచాయితీ మొదలైంది. కర్నూలులో చర్చలు పెడితే ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే ఆస్కారం ఉండటంతో ఈసారి ఎమ్మెల్యే ఆర్థర్‌, బైరెడ్డి సిద్దార్థరెడ్డిని పార్టీ పెద్దలు హైదరాబాద్‌కు రెండు రోజుల క్రితం పిలిపించి చర్చలు జరిపారు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదని తెలుస్తోంది. నందికొట్కూరు మున్సిపాలిటీలో 29 వార్డులు ఉండగా.. ఒక రు 14 వార్డులు, మరొకరు 15 వార్డులు తీసుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. అయితే బైరెడ్డి సిద్దార్థరెడ్డి 20 వార్డులు అడిగినట్లు తెలిసింది. వార్డుల పంపకాలు తెగకపోవడంతో అభ్యర్థుల పేర్లు రాసిచ్చి వెళ్లండని పార్టీ పెద్దలు చెప్పడంతో.. ఇద్దరూ 29 వార్డులకు పేర్లు ఇచ్చి వచ్చారనే ప్రచారం సాగుతోంది. వార్డుల్లో ఆర్థర్‌, సిద్దార్థరెడ్డి వర్గాలకు చెందిన 184 మంది నామినేషన్లు వేయగా మూడు తిరస్కరణకు గురయ్యాయి. 

ఇరు వర్గాలకు చెందిన 181 మంది అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకుల్లో ఎవరికెన్ని బీ ఫారాలు వస్తాయి? ఎవరు పోటీలో ఉంటారు? ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారు? అన్న విషయాలు రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Updated Date - 2021-02-27T05:35:10+05:30 IST