అధ్యక్ష ఎన్నికల రంగంలోకి ఒబామా.. ట్రంప్‌పై డైరెక్ట్ అటాక్..!

ABN , First Publish Date - 2020-10-22T16:32:54+05:30 IST

అమెరికా ప్రజానీకం మునుపెన్నడూ చూడని ఓ అరుదైన సంఘటన పెన్సిల్వేనియాలో జరిగింది.. పదవీకాలం పూర్తయ్యాక.. రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోయి.. అనివార్య కారణాల వల్ల ఓ అమెరికా మాజీ అధ్యక్షుడు మరోసారి ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి రావడం ఇదే మొట్టమొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అధ్యక్ష ఎన్నికల రంగంలోకి ఒబామా.. ట్రంప్‌పై డైరెక్ట్ అటాక్..!

వాషింగ్టన్: అమెరికా ప్రజానీకం మునుపెన్నడూ చూడని ఓ అరుదైన సంఘటన పెన్సిల్వేనియాలో జరిగింది.. పదవీకాలం పూర్తయ్యాక.. రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోయి.. అనివార్య కారణాల వల్ల ఓ అమెరికా మాజీ అధ్యక్షుడు మరోసారి ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి రావడం ఇదే మొట్టమొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2016 ఎన్నికల ఫలితాల అనంతరం ఒబామా.. పాలనా పగ్గాలను ట్రంప్‌కు అప్పగించి రాజకీయాల నుంచి వైదొలగారు. వాషింగ్టన్ నుంచే వెళ్లిపోయి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.. కానీ నాలుగేళ్లు తిరక్కముందే సీన్ రివర్స్ అయింది.. ‘అబద్దాల కోరు అయిన ట్రంప్‌ను ఓడించండి.. సమర్ధవంతమైన పాలనను ఇవ్వగలిగే జో బైడెన్‌ను గెలిపించండి..’ అంటూ ప్రజల ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు.


నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మాజీ ప్రెసిడెంట్ ఒబామాను డెమొక్రటిక్ పార్టీ రంగంలోకి దింపింది. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్‌ను గెలిపించాల్సిందిగా ఒబామా పిలుపునిచ్చారు. బుధవారం పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘బైడెన్, కమలా హారిస్ టీమ్‌కు కరోనా వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై పూర్తి అవగాహన ఉంది. అసమర్ధ పాలనతో అమెరికా ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారయింది. దాన్ని పూర్తిగా మార్చగలిగే సత్తా బైడెన్, కమలా హారిస్‌ టీమ్‌కు ఉంది. ఈ ట్రంప్‌ను మరో నాలుగేళ్లు భరించే ఓపిక అమెరికన్ సమాజానికి లేదు. వైట్‌హౌస్‌లో కూర్చుని ట్వీట్లు చేసినంతమాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు.. మీడియాపై కేకలు పెట్టినంత మాత్రాన అన్నీ సమస్యలు సద్దుమణిగిపోవు. కరోనా మహమ్మారి ఇంతలా విజృంభిస్తోంటే ప్రభుత్వాన్ని గాలికొదిలేశారు. ప్రజలకు అబద్దాలు చెప్పి వేల మంది ప్రాణాలను బలితీసుకున్నారు..’ అంటూ ట్రంప్‌పై ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు..


ఇటీవల బయటపడ్డ ట్రంప్ చైనా బ్యాంక్ అకౌంట్ గురించి కూడా ఒబామా తన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. ‘ఆయనకు చైనాలో ఓ రహస్య బ్యాంక్ అకౌంట్ ఉంది. అదెలా సాథ్యం.. నేను అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ పడుతున్న సమయంలో నాకు కూడా ఓ చైనా సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ ఉందని బయటపడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది.. నన్ను బీజింగ్ బర్రీ అని కామెంట్స్ చేస్తూ రచ్చ చేసేవారు కాదా..?’ అని ఒబామా సూటిగా ప్రశ్నించారు. 


‘అమెరికన్ల భద్రత గురించి ట్రంప్‌కు ఏమాత్రం పట్టదు. తనను తాను రక్షించుకోవడానికే ఆయన ప్రాధాన్యతనిస్తారు. ఆయనే కనుక ఈ నాలుగేళ్లు సరిగ్గా పనిచేసి ఉంటే.. ఇప్పుడు పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యేవా..? అమెరికన్ యువత ఇంకా నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుండేదా..? మీ జీవితంలో ఇవే అత్యంత ముఖ్యమైన ఎన్నికలుగా భావించండి. 2016లో జరిగిన పొరపాటును మళ్లీ జరగనివ్వొద్దు.. బైడెన్ గెలుస్తాడనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు..’ అంటూ అమెరికన్లకు ఒబామా పిలుపునిచ్చారు.

Updated Date - 2020-10-22T16:32:54+05:30 IST