ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ నిలిపివేత?

ABN , First Publish Date - 2021-05-09T07:40:24+05:30 IST

ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది.

ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ నిలిపివేత?

ప్రైవేటు ఆసుపత్రుల వారి పరిస్థితి ఏమిటో..

 ప్రభుత్వాసుపత్రుల్లోనూ అరకొర సరఫరానే

ఇటు వ్యాక్సినేషన్‌ కోసం ప్రజల ఆందోళన

జిల్లాకు 5 వేల కొవాగ్జిన్‌, 11 వేలు కొవిషీల్డ్‌

టోకెన్లు ఇచ్చేశారు... నేటి నుంచి వ్యాక్సినేషన్‌

విపరీతమైన ఒత్తిడికి గురవుతున్న వైద్యులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. కొద్దిరోజుల నుంచి ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్‌ పెరగడంలేదు. దీంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా కొవిడ్‌ వైద్యానికి ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. కానీ ఆక్సిజన్‌ కొరతతో ఎక్కువ మంది బాధితులు వైద్యుల కళ్లఎదుటే ప్రాణాలు వదిలేస్తున్నారు. ప్రభుత్వం చేతులెత్తేసిన సంగతి వైసీపీ నేతలే చెబుతున్నారు. అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో ఆక్సిజన్‌ సరఫరాను పెంచుకునే ప్రయత్నాలు చేయకుండా తాజాగా ప్రైవేట్‌ ఆసుపత్రులకు నిలిపివేసినట్టు సమాచారం. దీనిని ఓ వైద్యాధికారి ధ్రువీకరించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా చెబుతున్నాయి. దీంతో పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితులను డిశ్చార్జ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఒత్తిడి ప్రభుత్వ ఆసుపత్రులపైనా పడుతోంది. అక్కడ ఇప్పటికే బెడ్స్‌ అన్నీ నిండిపోయాయి.  ఆక్సిజన్‌ అరకొరగానే ఉంది. బాధితులు పెరిగిపోవడంతో ఆక్సిజన్‌తో పాటు వెంటిలేటర్ల అవసరం, ఇటు బెడ్స్‌ అవసరం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో బెడ్స్‌ పెంచి, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ విషయంలో గందరగోళం నెలకొంది. ఇటుచూస్తే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రజల్లో ఎన్నడూ లేనంత ఆందోళన మొదలైంది. మానసికంగా ధైర్యం తెచ్చుకున్నవారు కాస్త ఆగగలుగుతున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అటు వ్యాక్సిన్‌ వేయడం, ఇటు టెస్ట్‌లు చేసి ముందుగానే మందులు వాడిస్తే కొంత సమస్య తగ్గుతుంది. టెస్ట్‌లు లేకపోవడం వల్ల రోగం ముదిరిన తర్వాత ఆసుపత్రులకు రావలసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాక్సిన్‌ అవసరమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు. దాంతో అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని చూస్తున్నారు. కానీ వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. అయితే చాలారోజుల తర్వాత జిల్లాకు 5వేల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు, 11 వేల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వచ్చాయి. ఈసారి జిల్లా స్థాయి అధికారులే టోకెన్లు ఇచ్చి ఏ ప్రాంతంలో ఎన్ని వేయాలనేది లెక్కించారు. రాజమహేంద్రవరంలో 6 వేల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు అవసరం కాగా 15 వందలు కేటాయించినట్టు సమాచారం. అర కోటి జనాభా ఉన్న జిల్లాలో ఇప్పటివరకూ కేవలం 6 లక్షల మంది కి వ్యాక్సినేషన్‌ జరిగింది. మిగతా వారంతా వాక్సిన్‌ వస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. పలుకుబడి, డబ్బు ఉన్నవారికి కూడా వ్యాక్సిన్‌ దొరకడంలేదు. ఇక సామాన్యుల సంగతేంటి? మరోవైపు వైద్యాధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. కానీ వారికి సరిపడ బెడ్స్‌, ఆక్సిజన్‌ లేదు. బాధితులు, వారి బంధువుల నుంచి వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈలోపు రాజకీయ నేతలు, అధికారులు, ఇతర పలుకుబడి గల వర్గాల నుంచి సిఫార్సులు వస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని స్థితి. వ్యాక్సినేషన్‌ ముందుగా ఇచ్చి ఉంటే ఇంత ఒత్తిడి ఉండేది కాదని ఓ వైద్యుడు అభిప్రాయపడ్డారు. తమ కళ్లెదుటే ప్రాణాలు పోతుం టే ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.



Updated Date - 2021-05-09T07:40:24+05:30 IST