భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు

ABN , First Publish Date - 2021-05-17T05:13:51+05:30 IST

భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు

భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు

రేపు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్‌

రోగులకు అందుబాటులోకి రానున్న 13వేల కిలోలీటర్ల ప్రాణవాయువు

భద్రాచలం, మే 16: భద్రాద్రి జిల్లాలోనే అత్యధికంగా కరోనా బాధితులకు వైద్యసేవలంది స్తున్న భద్రాచలం ఏరియా వైద్యశాలలో 13వేల కిలోలీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రాచలంలో ఇప్పటికే దాదాపు 100సిలిండర్లతో కరోనా రోగులకు ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. అదేవిధంగా నిమిషానికి 300 లీటర్ల ఆక్సిజన్‌ను తయారు చేసే ఆక్సిజన్‌ జనరేటర్‌ ఇప్పటికే వినియోగంలో ఉంది. తాజాగా 13 వేల కిలో లీటర్ల ఆక్సిజన్‌ లిక్విడ్‌ ప్లాంటు ఏర్పాటుతో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ను అందించడం మరింత సులభతరం కానుంది. 140 మందికి వైద్య చికిత్స అందించేలా ఇప్పటికే కలెక్టరు ఎంవీ రెడ్డి, అదనపు కలెక్టర్‌ అనిరుధ్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా మంగళవారం ఆక్సిజన్‌ ప్లాంటు ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌ పలు అంశాలపై జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నారు.  ఈ సమీక్షలో ఇంటింటి సర్వే, ఓపీ సేవలు ఏ విధంగా ఉన్నాయి, కరోనా బారిన పడి  సీరియస్‌గా ఉన్న రోగులకు ఏ విధంగా చికిత్స నిర్వహిస్తున్నారు, విషమంగా ఉన్న వారిని ఏ విధంగా వైద్యశాలకు తరలిస్తున్నారు, ఆక్సిజన్‌ బెడ్ల పరిస్థితి, ఆక్సిజన్‌ సరఫరా, టెస్టులు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శిరీష, సబ్‌కలెక్టరు వెంకటేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొననున్నారు. 

Updated Date - 2021-05-17T05:13:51+05:30 IST