తగ్గేదే లేదు!

ABN , First Publish Date - 2022-07-16T12:47:45+05:30 IST

పార్టీ నుంచి తనను బహిష్కరించిన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గంపై కక్ష తీర్చుకునేందుకు ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) సిద్ధమవుతున్నారు.

తగ్గేదే లేదు!

              - పోటీ సర్వసభ్యమండలి సమావేశానికి Ops ముమ్మరంగా సన్నాహాలు ?


చెన్నై, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పార్టీ నుంచి తనను బహిష్కరించిన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గంపై కక్ష తీర్చుకునేందుకు ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఈపీఎస్‌ వర్గం నిర్వహించిన సర్వసభ్యమండలి సమావేశానికి బదులుగా తానూ ఆ తరహా సమావేశం నిర్వహించి, తన సత్తా చాటాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీలో 98 శాతం మంది పార్టీ నిర్వాహకులు, సర్వసభ్యమండలి సభ్యులు ప్రస్తుతం ఈపీఎస్‌ వెంటనే ఉన్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఈ విష యం స్పష్టమైంది. ఆ మేరకు సర్వసభ్యమండలి సభ్యుల మెజారిటీతోనే ఈపీఎస్‌ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్వసభ్యమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, నియామకాలకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించి అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ వర్గంలో శాసనసభ్యులు వైద్యలింగం, మనోజ్‌పాండ్యన్‌, సర్వసభ్యమండలికి సంబంధించి సుమారు వందమంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితోనే సర్వసభ్యమండలి సమావేశం జరిపి, తమ వర్గమే అసలైనదని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాలని ఓపీఎస్‌ నిర్ణయించారు. ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


44 మంది ఈపీఎస్‌ వర్గీయుల తొలగింపు...

అన్నాడీఎంకేకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఈపీఎస్‌ తన వర్గ నేతలను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఓపీఎస్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగారు. అసలైన అన్నాడీఎంకే తనదేనని ఇప్పటికే ప్రకటించుకున్న ఓపీఎస్‌.. ఈపీఎస్‌ వర్గానికి చెందిన మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలుగా వున్న 44 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఆ మేరకు మాజీ మంత్రులు పొల్లాచ్చి జయరామన్‌, సి.విజయభాస్కర్‌, బెంజమిన్‌, బీవీ రమణి, కేసీ వీరమణి, కేపీ అన్బళగన్‌, ఎంఆర్‌ విజయభాస్కర్‌, ఆర్‌ కామరాజ్‌తోపాటు వివిధ పార్టీ విభాగాలకు చెందిన కీర్తికా మునియసామి, ఆర్‌ఎస్‌ రాజేష్‌, టీజీ వెంకటే్‌షబాబు బాలగంగా సహా 44 మందిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించి పార్టీకి తీరని కళంకం తెచ్చినందుకుగాను ఈ చర్యలను చేపట్టినట్లు పన్నీర్‌సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం లెటర్‌పాడ్‌పై పార్టీ సమన్వయకర్త హోదాలో ఆయన సంతకం చేసి ఈ ప్రకటన జారీ చేయడం గమనార్హం.

Updated Date - 2022-07-16T12:47:45+05:30 IST