Former Chief Minister: ఓపీఎస్‏కు మరో షాక్‌!

ABN , First Publish Date - 2022-10-02T12:54:49+05:30 IST

పార్టీలో ఆధిపత్యం కోసం న్యాయపోరాటం సాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam)కు షాక్‌ ఇచ్చేలా

Former Chief Minister: ఓపీఎస్‏కు మరో షాక్‌!

- పార్టీ సభ్యులకు కొత్త గుర్తింపు 

- ఈపీఎస్‌ తాజా వ్యూహం


చెన్నై, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పార్టీలో ఆధిపత్యం కోసం న్యాయపోరాటం సాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam)కు షాక్‌ ఇచ్చేలా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సరికొత్త వ్యూహరచన చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు స్టే ఇవ్డం ఓపీఎస్‌ వర్గానికి తాత్కాలికంగా ఊరట కలిగించింది. అదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలకు తొందరపడటమెందుకని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై ఈపీఎస్‌ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓపీఎస్‌ అప్పీలు విచారణ ముగిసేంతవరకు మాత్రమే ఆ ఎన్నికల ప్రక్రియపై సుప్రీం కోర్టు స్టే విధించిందన్న విషయం గమనించాల్సిన అంశమని ఈపీఎస్‌ వర్గీలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ పార్టీలో బలసమీకరణ దిశగా జిల్లాల వారీ పర్యటనకు సిద్ధమవుతుండగా, ఈపీఎస్‌ సర్వసభ్యమండలి సమావేశం ఏర్పాట్లలో భాగంగా కొత్త వ్యూహం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆ దిశగా పార్టీ సభ్యులందరికి కొత్త గుర్తింపు కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు కొత్త గుర్తింపు కార్డుల ముద్రణ పనులు కూడా జరుగుతున్నాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ హయాంలో పార్టీ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) హయాంలో ఆమె ఫొటో ఉన్న గుర్తింపు కార్డులను అందజేశారు. జయ మృతి తర్వాత పార్టీ సమన్యయకర్త ఓపీఎస్‌, ఉప సమన్వయకర్త ఈపీఎస్‌ ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులను కోటిన్నర మందికి పైగా ఉన్న సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం పార్టీలో అత్యధిక శాతం సర్వసభ్యమండలి సభ్యుల మద్దతు కలిగిన ఈపీఎస్‌ తన ప్రత్యర్థి ఓపీఎస్‌ అనుచరులను పార్టీకి దూరం చేసి, తన వర్గలో కలుపుకునేవిధంగా పావులు కదుపుతున్నారు. ఓపీఎస్‌ అప్పీలుపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనం సర్వసభ్యమండలి సమావేశం జరిపేందుకు తమ వర్గానకే అనుమతిస్తుందని ఈపీఎస్‌ భావిస్తున్నారు. ఓపీఎస్‌ అప్పీలుపై విచారణ పూర్తయిన తర్వాత పార్టీ సర్వసభ్యమండలి సమావేశాన్ని వీలైనంత త్వరగా జరపాలని ఆయన నిర్ణయించారు. అదే సమయంలో తాము కొత్తగా జారీ చేస్తున్న గుర్తింపు కార్డులున్న సభ్యులనే సమావేశానికి అనుమతించాలని కూడా భావిస్తున్నారు. కొత్త గుర్తింపు కార్డుల్లో కేవలం జయలలిత, ఈపీఎస్‌ ఫొటోలు మాత్రమే ముద్రిస్తున్నారు. సర్వసభ్యమండలి సమావేశానికి ముందే ఈ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఇప్పటికే ఈపీఎస్‌ జిల్లా శాఖ కార్యదర్శులందరికీ ఉత్తర్వులిచ్చారు. నవంబర్‌ 21న సుప్రీం కోర్టులో ఓపీఎస్‌ అప్పీలుపై తుది విచారణ జరుగుతుందని, ఆ తర్వాత రెండు వారాల్లోగా తీర్పు వెలువడే అవకాశం ఉందని ఈపీఎస్‌ భావిస్తున్నారు. ఆ మేరకు ఈపీఎస్‌ నాయకత్వంలో డిసెంబర్‌ మొదటి వారంలోగానీ, రెండోవారంలోగానీ సర్వసభ్యమండలి సమావేశం జరపాలని ఆయన వర్గీయులు చెబుతున్నారు. 


ఓపీఎస్‌ మంతనాలు...

ఇదిలా ఉండగా ఓపీఎస్‌ సుప్రీం కోర్టులో తన అప్పీలుపై జరుగనున్న తుది విచారణ సమయంలో బలమైన వాదనలు వినిపించేందుకుగాను న్యాయనిపుణులతో మంతనాలు చేస్తున్నారు. అదే సమయంలో ఈపీఎస్‏పై వ్యతిరేకత ఉన్న మాజీ నేతలందరినీ తన వర్గంలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రి బన్రూట్టి రామచంద్రన్‌ ఇటీవల తన వర్గంలో చేరడంతో అతడిని పార్టీ సలహాదారుగా నియమించారు. ఇదే విధంగా పలువురు మాజీ నేతలను తన వర్గంలో చేర్చుకుని జిల్లాల వారీ పర్యటన సాగించి పార్టీలో బలాన్ని పెంచుకోవాలని ఓపీఎస్‌ బావిస్తున్నారు.

Updated Date - 2022-10-02T12:54:49+05:30 IST