Ops తొలగింపునకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-07-03T13:48:22+05:30 IST

అన్నాడీఎంకే సభ్యత్వం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంను తొలగిస్తూ సర్వసభ్యమండలి సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేసేందుకు పార్టీ

Ops తొలగింపునకు రంగం సిద్ధం

                     - మద్దతుదారులతో ఈపీఎస్‌ మంతనాలు


చెన్నై, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సభ్యత్వం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంను తొలగిస్తూ సర్వసభ్యమండలి సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సిద్ధమవుతున్నారు. సర్వసభ్యమండలిలో 90 శాతం సభ్యులంతా అధికార డీఎంకేతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ఓపీఎస్‏ను తొలగించాలని పట్టుబడుతుండటంతో ఈపీఎస్‌ మళ్ళీ తన మద్దతుదారులతో చర్చలు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఈ నెల 11న సర్వసభ్యమండలి సమావేశం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి సర్వసభ్యమండలి సభ్యులందరికీ శనివారం ఆహ్వానపత్రాలను పంపారు. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా ఉన్న ఓపీఎస్‏కు కూడా ఈ ఆహ్వానపత్రం పంపుతామని ఈపీఎస్‌ వర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు తెలిపారు. పార్టీలో ఏకనాయకత్వంపై చెలరేగిన వివాదం ఈ నెల 11న ఈపీఎస్‏ను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడంతో సద్దుమణగనుందని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వసభ్యమండలిని అడ్డుకునేందుకు ఓపీఎస్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని, ఈ పరిస్థితుల్లో సర్వసభ్యమండలి సమావేశం సజావుగా సాగే అవకాశం ఉందన్నారు. 


డీఎంకేతో సఖ్యతే కారణమా?

అన్నాడీఎంకేలో ఓపీఎస్‌ ప్రస్తుత పరిస్థితికి స్వయంకృత అపరాధమే కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికార డీఎంకేతో ఓపీఎస్‌, ఆయన తనయుడు, ఎంపీ రవీంద్రనాధ్‌ సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, అసమ్మతివర్గం నాయకురాలు శశికళ పట్ల సానుకూలంగా వ్యవహరించడం వల్లే పార్టీలో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుందని తెలుస్తోంది. ఏడాదిపాటు పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి తొలగించేందుకు ఎడప్పాడి వర్గీయులంతా వ్యూహరచనలు చేస్తూ వచ్చారు. తొలుత సర్వసభ్యమండలిలో ఓపీఎస్‏కు ఉన్న బలంపై ఆరా తీశారు. ఆయన వెంట వందమంది కూడా లేరని తెలుసుకున్నారు. అదే విధంగా శాసనసభ్యుల్లో ఒకరిద్దరు మినహా మరెవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వరని స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో గత నెల జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఓపీఎస్‌, ఈపీఎస్‌ సమక్షంలోనే ఏకనాయకత్వంపై తీవ్ర చర్చలు జరిగాయి. దీంతో ఖంగుతిన్న ఓపీఎస్‌ ఎప్పటిలాగే ద్వంద్వ నాయకత్వమే కొనసాగాలని పట్టుబట్టారు. అదే సమయంలో ఈపీఎస్‌, ఆయన వర్గీయులు ఓపీఎస్‏కు ఏకనాయకత్వంపై నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఓపీఎస్‌ పాల్గొని సభ్యులందరి వ్యతిరేకతను మూటగట్టుకుని నిష్క్రమించారు. మళ్ళీ ఈ నెల 11న ఈపీఎస్‌ నాయకత్వంలో జరుగనున్న సర్వసభ్యమండలిపై హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చేందుకు ఓపీఎస్‌ చేసిన ఆఖరి ప్రయత్నం కూడా ఫలించలేదు. 


మాజీ మంత్రులతో ఈపీఎస్ మంతనాలు

ఇదిలా ఉండగా ఈ నెల 11న జరిగే సర్వసభ్యమండలి సమావేశంలో ప్రధానంగా డీఎంకే ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలతో కొన్ని తీర్మానాలు  రూపొందించేందుకు ఈపీఎస్‌ వర్గీయులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ మేరకు శనివారం ఉదయం స్థానిక అడయార్‌ గ్రీన్‌వేస్ రోడ్డులోని ఈపీఎస్‌ నివాసగృహంలో మాజీ మంత్రులు మంతనాలు సాగిస్తున్నారు. ఈపీఎస్‌ సతీమణికి కరోనా లక్షణాలు నిర్ధారణ కావటంతో కొద్ది రోజులుగా ఆయన ఇంటిపట్టునే ఎవరితోనూ కలువకుండా ఐసోలేషన్‌లో గడిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మాజీ మంత్రులు సెంగోటయ్యన్‌, ఎస్పీ వేలుమణి, తంగమణి, కామరాజ్‌, విజయభాస్కర్‌, కేపీ అన్బళగన్‌, సీవీ షణ్ముగం, మాజీ శాసనసభ్యుడు, న్యాయవాది ఇన్బదురై తదితరులు ఈపీఎస్‏ను కలుసుకుని సర్వసభ్యమండలి తీర్మానాలపై సమగ్రంగా చర్చలు జరిపారు.

Updated Date - 2022-07-03T13:48:22+05:30 IST