Jayalalita మృతిపై అనుమానం లేదు..

ABN , First Publish Date - 2022-03-23T16:29:11+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ అప్పట్లో శశికళపై ‘ధర్మయుద్ధం’ పేరిట తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వంకు

Jayalalita మృతిపై అనుమానం లేదు..

                  - జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ఎదుట ఓపీఎస్‌ రెండోరోజు వాంగ్మూలం


చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ అప్పట్లో శశికళపై ‘ధర్మయుద్ధం’ పేరిట తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వంకు ఇప్పటికి జ్ఞానోదయమైనట్లుంది. జయ మృతిపై తనకెలాంటి సందేహం లేవంటూ జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ఎదుట వాంగ్మూలమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరంకుండ్రం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారని, వారికి సంబంధించిన బీ ఫామ్‌లపై ఆమె వేలిముద్రలు వేసిన విషయం తనకు తెలుసునని ఆయన వివరించారు. సోమవారం ఉదయం జస్టిస్‌ ఆర్ముగస్వామి విచారణ కమిషన్‌ ఎదుట హాజరైన ఓపీఎస్‌.. మంగళవారం కూడా స్థానిక ఎళిలగంలో వున్న కమిషన్‌ కార్యాలయానికి వచ్చారు. తొలిరోజు కమిషన్‌ అడిగిన 70 ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఓపీఎస్‌.. రెండోరోజు మంగళవారం కూడా వాటిని కొనసాగించారు. జయకు అమర్చిన ఎక్మోపరికరాన్ని తొలగించడానికి ముందు మరో ముగ్గురు మంత్రులతో వెళ్ళి చూశానని చెప్పారు. ఎక్మో పరికరం అమర్చిన విషయాన్ని అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ తనకు తెలిపారన్నారు. ఆమె మృతికి సంబంధించి తనకెలాంటి సందేహాలుగాని అనుమానాలు గానీ లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆమె మృతిపై ప్రజల్లో అనుమానాలు బయలుదేరటం వల్లే విచారణ జరపాలని కోరినట్టు తెలిపారు.. జయకు అందించిన సీపీఆర్‌ చికిత్స గురించి తనకేమీ తెలియదన్నారు. అపోలో ఆస్పత్రిలో జయకు ఎలాంటి ఆహారం ఇచ్చారనే విషయం తనకు తెలియదని, చికిత్స పొందుతున్నప్పుడు ఆమె కులాసాగానే ఉన్నట్లు శశికళ తనకు చెప్పారని, ఆ విషయాన్నే తాను మంత్రివర్గ సహచరులకు వివరించానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించి జయ ఆదేశాలు జారీ చేసినట్లు శశికళ తనకు చెప్పలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.


శశికళపై గౌరవం ఉంది ...

జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణ సందర్భంగా అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ అడిగిన పలు ప్రశ్నలకు కూడా పన్నీర్‌సెల్వం సమాధానాలిచ్చారు. శశికళను వ్యక్తిగతంగా తాను ఇప్పటికీ గౌరవిస్తున్నానని, ఆమెపై అభిమానం ఏమాత్రం తగ్గలేదని ప్రకటించారు. జయ మృతికి సంబంధించి శశికళపై పలు ఆరోపణలు రావడం వల్లే తాను విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరానని, దీనికి తోడు ప్రజల్లోనూ అనుమానాలు బయలుదేరటంతో విచారణ సంఘం కోసం పట్టుబట్టానని పన్నీర్‌సెల్వం వివరించారు. 2016 డిసెంబరు 5వ తేదీన జయ మృత్యువుకు చేరువవుతున్న సమయంలోనే ఆమెను చూశానని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. వ్యక్తిగతంగా జయ మృతిపై తనకెలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు.



Updated Date - 2022-03-23T16:29:11+05:30 IST