పన్నీర్‌సెల్వం దారెటు ?

ABN , First Publish Date - 2022-06-23T13:53:26+05:30 IST

‘తన’ అనుకున్న నేతలంతా దూరమై, పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం తదుపరి నిర్ణయమేంటన్నదానిపై

పన్నీర్‌సెల్వం దారెటు ?

చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘తన’ అనుకున్న నేతలంతా దూరమై, పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం తదుపరి నిర్ణయమేంటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90 శాతం ఈపీఎస్‌ వైపు చేరడంతో ఆ బృందం చెప్పింది వినడం మినహా ఓపీఎస్‏కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గురువారం జరుగనున్న అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఈపీఎ్‌సను సర్వాధిపతిగా ఎన్నుకోవడం ఖాయమైన తరుణంలో ఓపీఎస్‌ అడుగులెటువైపన్న చర్చ సాగుతోంది. 2016లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఓపీఎస్‏కు అనతికాలంలోనే పదవీగండం ఎదురైంది. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఓపీఎస్‌.. తనను పదవి నుంచి తప్పించిన శశికళపై ‘ధర్మయుద్ధం’ పేరుతో తిరుగుబాటు చేశారు. అయినా ఆయన తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌).. ఆ తరువాత ఢిల్లీ పెద్ద ల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. అయితే ఆ పెద్దల సూచనతో ఓపీఎస్‏ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి సైతం కట్టబెట్టారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పార్టీ సమన్వయకర్తగా ఓపీఎస్‌, ఉపసమన్వయకర్తగా ఈపీఎస్‏కు పదవుల పందేరం జరిగింది. 


ఆది నుంచి ఈపీఎస్‏దే పైచేయి..

ఈపీఎస్‌ ఉపసమన్వయకర్తగా వున్నా పార్టీలో ఆయనదే పైచేయిగా నిలిచింది. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతోఆయన మాటే చెల్లుబాటయింది. అప్పటి నుంచి పార్టీపై పూర్తిగా పట్టు సాధించిన ఈపీఎస్‌.. తరువాతి కాలంలో మరొకరితో పగ్గాలు పంచుకునేందుకు విముఖత కనబరుస్తూ వచ్చారు. పార్టీలో క్రియాశీలకమైన 60 మంది జిల్లా కార్యదర్శుల్లో ఎక్కువమంది తన వెంటే ఉండడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 66 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా ఈపీఎస్‌ వెంట వుండడం కూడా ఆయనకు ధైర్యాన్నిచ్చింది. దీనికి తోడు ఓపీఎస్‌ శశికళతో సన్నిహితంగా ఉండడం, ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో తనను సాగనంపేందుకు కుట్ర జరుగుతోందన్న నిర్ణయానికి వచ్చిన ఈపీఎస్‌.. ‘ఏకనాయకత్వం’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. 


సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది..: ఏకనాయకత్వంపై ఈపీఎస్‌ ముందుగానే ఓపీఎ్‌సకు సర్ది చెప్పారని అన్నాడీఎంకే వర్గాల భోగట్టా. ప్రధాన కార్యదర్శిగా తాను పగ్గాలు చేపట్టదలచానని, అందుకు మద్దతు ఇస్తే పార్టీలో గౌరవప్రదమైన పదవితో పాటు మున్ముందు ఓపీఎస్‌ వర్గానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తానని కూడా ఈపీఎస్‌ సర్ది చెప్పినట్లు తెలిసింది. అయితే అందుకు ఓపీఎస్‌ ససేమిరా అనడంతో ఈపీఎస్‌ తన వ్యూహాన్ని అమలులో పెట్టారు. దీంతో పార్టీలో ఓపీఎస్‌ అధికారాల కత్తెరకు ముహూర్తం పడినట్లయింది. పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంపై ఇటీవల చెన్నై వచ్చిన ప్రధాని వద్ద కూడా ఈపీఎస్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకు ఢిల్లీ పెద్దలు తలూపడం వల్లనే ఆయన ఈ సాహసానికి దిగినట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఆది నుంచి శశికళను వ్యతిరేకించిన ఓపీఎస్‌.. ఇప్పుడామెను పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం కనబరచడం ఢిల్లీ పెద్దలకు కూడా నచ్చడం లేదని, అందుకే మొదట్లో ఓపీఎ్‌సకు అండగా నిలిచిన ప్రధాని.. ఆ తరువాత ఆయన్ని దూరంగా పెట్టారని బీజేపీ వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. 


ఓపీఎస్‌ ముందున్న మార్గాలు...: పార్టీ జిల్లా కార్యదర్శుల్లో మొన్నటి వరకూ ఓపీఎస్‌ వెంట 20 మంది ఉండగా, బుధవారం సాయంత్రం నాటికి ఆ సంఖ్య ఐదుకు పడిపోయింది. గురువారం నాటికి ఈ సంఖ్య మరింత తగ్గిపోవచ్చని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీంతో గురువారం జరిగే సర్వసభ్య మండలి సమావేశంలో ఓపీఎస్‌ గళం వినిపించే అవకాశమే లేకుండాపోయింది. దీంతో ఆయన ఏం చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన ముందు ఐదు మార్గాలు కనిపిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అందులో ఒకటి సర్వసభ్యమండలి సమావేశాన్ని బహిష్కరించడం, రెండు సమావేశానికి హాజరైనా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‏ను ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సమావేశం నుంచి వాకౌట్‌ చేయడం, మూడు ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడాన్ని ఖండిస్తూ సమావేశంలో గలాభా సృష్టించి, గెంటివేతకు గురవడం ద్వారా పార్టీలో కొంతైనా సానుభూతి సంపాదించడం, ఈపీఎస్‌ ఆధిపత్యాన్ని అంగీకరించి, ఆయన ఇచ్చిన పదవితో సంతృప్తి పడడం. ఐదవది పార్టీకి రాజీనామా చేసి శశికళ పంచన చేరడం. వీటిల్లో ఓపీఎస్‌ ఏ మార్గం ఎన్నుకుంటారన్నదానిపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Updated Date - 2022-06-23T13:53:26+05:30 IST