కరోనా బాధితుల గుర్తింపులో నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2020-07-18T10:21:42+05:30 IST

కొవిడ్‌-19 బాధితులను గుర్తింపులో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు.

కరోనా బాధితుల గుర్తింపులో  నిర్లక్ష్యం వద్దు

ప్రైమరీ, సెంకడరీ కాంటాక్టులకు  పరీక్షలు నిర్వహించాలి

సామాజిక వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోండి

వైద్య సిబ్బందికి  కలెక్టర్‌ నివాస్‌ ఆదేశం


ఆమదాలవలసరూరల్‌, జూలై 17: కొవిడ్‌-19 బాధితులను గుర్తింపులో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో పురపాలక సంఘం సిబ్బంది, వైద్య, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువుగా ఉన్నందున బాధితులను వీలుంత త్వరగా గుర్తించాలన్నారు. ప్రైమరీ, సెంకడరీ కాంటాక్టులకు త్వరిగతిన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్లలో సామాజిక వ్యాప్తి జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.


దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను నిరంతరం పరీక్షించాలని సూచించారు.  కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని, ఆక్సిజన్‌ శాతం తక్కువ ఉన్నవారిని గుర్తించి ర్యాపిడ్‌ పరీక్షలు చేసి పరిస్థితిని అంచనా వేయాలన్నారు.  వీలైనంత ఎక్కువమందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా సంభవించకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవిడ్‌ ప్రత్యేకాధికారి వి.పద్మ, కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌,  తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


అవగాహనతోనే నియంత్రణ

రామలక్ష్మణ జంక్షన్‌: అవగాహన, ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనాను నియంత్రించవచ్చని శ్రీకాకుళం లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి నటుకుల మోహన్‌ పేర్కొన్నారు.  ఈ మేరకు శుక్రవారం ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డు, శాంతి నగర్‌ కాలనీలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు.  సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు, శానిటైజర్లు వినియోగించా లన్నారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు శ్రీనివాస్‌, రామ్మోహన్‌, జగన్నాథంనాయుడు, వాసుదేవాచారి తదితరులు పాల్గొన్నారు. 


భౌతిక దూరం తప్పనిసరి

వర్తకులు అప్రమత్తంగా ఉంటూ దుకాణాలకు వచ్చే వినియోగదారులు నిబంధనలు పాటించేలా చూడాలని టూటౌన్‌ సీఐ పి.వెం కటరమణ పేర్కొ న్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌, బ్యాంకులు, దుకాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, వినియోగ దారులు లోపలికి వచ్చే సమయంలో శానిటైజర్‌తో వారి చేతులను శుభ్రం చేయాలని పేర్కొన్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న వైద్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. కార్యక్ర మంలో టూటౌన్‌ ఎస్‌ఐ ప్రవళిక, హెచ్‌సీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టండి

గార: కరోనా వైరస్‌ నేపథ్యంలో గ్రామాల్లో  ఫీవర్‌ సర్వే పక్కాగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి గుత్తు రాజారావు ఆదేశించారు. బూరవిల్లిలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం వైద్య, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.


20 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ 

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో కరోనా కట్టడికి ఈ నెల 20వ తేది నుంచి 10రోజులుపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కమిషనర్‌ లాలం రామలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పదిరోజులూ ఎటువంటి దుకాణాలు తెరవనివ్వమన్నారు. అందువల్ల ముందస్తుగా నిత్యావసర సరుకులు సమకూర్చుకోవాలన్నారు.  


మూతపడిన బ్యాంకులు

కరోనా నేపథ్యంలో మునిసిపాలిటీ పరిధిలోని బ్యాంకులన్నీ శుక్రవారం మూతపడ్డాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. కొన్ని బ్యాంకుల్లోని సిబ్బందికి కరోనా వైరస్‌ సోకడంతో ఆయా ప్రాంతాల్లో కంటైన్మెమెంట్‌ జోన్లుగా అధికారులు ప్రకటించారు. మరో పదిరోజులపాటు బ్యాంకులన్నీ మూతపడున్నట్టు ఆయా బ్యాంకు మేనేజర్లు తెలిపారు. అలాగే మరో రెండు రోజుల్లో పూర్తి లాక్‌డౌన్‌ అని అధికారులు ప్రకటించటంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తగా ముందులు తీసుకుంటున్నారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి మందుల షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. అలాగే అనవసరంగా రోడ్లుపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని ఇచ్ఛాపురం పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం పట్టణ ప్రఽదాన జంక్షన్లలో వాహనదారులకు అవగాహన కల్పించారు. మరోసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


ప్రజలంతా సహకరించాలి

సోంపేట: కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సోంపేట తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. 


కంచిలి : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మండల వాసులంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో చల్లా శ్రీనివాసరెడ్డి కోరారు. శుక్రవారం వారు కంటోన్మెంట్‌ జోన్లలో పర్యటించారు. కంచిలిలో లాక్‌డౌన్‌ ప్రకటించటం జరిగిందని, అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రజలు బైటకు రావాలన్నారు.


భామిని: కరోనా మహమ్మారి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో నిమ్మల మాస కోరారు. శుక్రవారం బత్తిలి మేజర్‌ పంచాయతీలో సచివాలయ సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు.   పంచాయతీ కార్యదర్శి కేకే బుట్టో, సచివాలయ సిబ్బంది ఎన్‌.గంగారావు, పి.తురసాన, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వలంటీర్లు పాల్గొన్నారు. 


 కంటైన్మెమెంట్‌ జోన్‌ ఏర్పాటు 

పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఓ వీధిని కంటైన్మెమెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేసినట్టు ఆర్డీవో, నగరపంచాయతీ ప్రత్యేకాధికారి టీవీఎస్‌జీ కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఆ వీధిలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో బ్లీచింగ్‌ వేసి, క్లోరినేషన్‌ చేసినట్టు చెప్పారు.  కమిషనర్‌ బీఎం శివప్రసాద్‌ తదితరులు ఉన్నారు. 


 తప్పని అవస్థలు 

సీతంపేట: కంటైన్మెంట్‌ జోన్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత ఐదు రోజులుగా కనీసం నిత్యవసరాలు కూడా కొనుక్కోవడానికి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని కొన్ని వీధులతోపాటు మరికొన్ని గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా అధికారులు ప్రకటించారు. మరో  ప్రజలకు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని  అధికారులు చెబుతున్నా ఎవరూ ఆ దిశగా పాటించడం లేదు. కాగా మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉండడంతో ఆ శాఖల సిబ్బందికి కరోనా పరీక్షలు  చేయాలని జెమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రి వైద్యులు శ్యాంపిల్స్‌ సేరిస్తున్నారు. 

Updated Date - 2020-07-18T10:21:42+05:30 IST