ఓ కొండమల్లె!

ABN , First Publish Date - 2022-07-27T06:11:22+05:30 IST

ఎక్కడో ఒక చోట న్యాయం మొలిచింది ఒక అల ఒడ్డును తాకింది ఒక నక్షత్రం నేలన మెరిసింది ఒక చెట్టు పండును చేతికిచ్చింది...

ఓ కొండమల్లె!

ఎక్కడో 

ఒక చోట న్యాయం మొలిచింది

ఒక అల ఒడ్డును తాకింది

ఒక నక్షత్రం నేలన మెరిసింది

ఒక చెట్టు పండును చేతికిచ్చింది

విసిరేయబడ్డ అడవి నవ్వింది

ప్రజాస్వామ్యానికి శోభనిచ్చింది!


ఒక చినుకు

విత్తనానికి పురుడు పోస్తది

ఒక అక్షరం

మహాకావ్యానికి ఊయలైతది

ఒక గౌరవం

విస్మృత వర్గాలకు స్పూర్తినిస్తది!


అవకాశం

ఏ ఆకాశమిస్తేం

వెలుగు

ఏ భూమిలో పూస్తేం

న్యాయం

ఏ చేతిలో పరిమళిస్తేం

భారత శిఖరాగ్రంపై ఓ కొండమల్లె!


అసమానతల ప్రవాహంలో

పరువు హత్యల పందెంలో

మతోన్మాదాల మారణహోమంలో

దీపం లేని గూడెంలో

నోరే లేని సమాజంలో

దరిదాపు లేని కాలంలో

ఒక ఆశ ఒక కల 

ఒక నిజం ఒక ధైర్యం!

వనపట్ల సుబ్బయ్య

(కొత్త రాష్ట్రపతికి శుభాకాంక్షలతో)

Updated Date - 2022-07-27T06:11:22+05:30 IST