Abn logo
Sep 26 2021 @ 23:41PM

అయ్యో అంజిలమ్మ..!

ప్లాస్టిక్‌ కవర్‌కప్పి గుడిసెలో ఉంటున్న వార్డు సభ్యురాలి కుటుంబం

  • గూడు కరువాయే.. ప్లాస్టిక్‌ కవర్‌ నీడ దిక్కాయే..
  • దయనీయంగా అధికార పార్టీ వార్డు సభ్యురాలి కుటుంబ పరిస్థితి 


బషీరాబాద్‌:  మండల కేంద్రంలోని ఓ వార్డు మహిళా సభ్యురాలి దీనస్థితి చూస్తే కన్నీళ్లు వస్తాయి. స్థానిక బుడగజంగం కాలనీకి చెందిన బుడగజంగం సంకుల శంకర్‌, అంజిలమ్మ దంపతులు వారి ఇద్దరు కుమారులతో గతంలో సొంతింట్లో ఉండేవారు. భార్య కూలీ పనికి వెళ్లగా, భర్త స్థానికంగా చిన్నచిన్న చెరువుల్లో చేపపిల్లలు వదిలి ఆ తర్వాత అమ్ముకుంటూ ఇంతకాలం జీవనం సాగించేవారు. వారి వ్యాపారం ఆశాజనకంగా ఉండటంతో అప్పులు చేసి చేపపిల్లలను కొనుగోలుచేసి చెరువుల్లో వదిలారు. మూడేళ్ల కిందట చెరువుల్లో వదిలిన చేపలు భారీ వర్షాలకు కొట్టుకు పోగా, మరికొన్ని చెరువుల్లో కనీసస్థాయికి నీరు చేరక మృత్యువాతపడ్డాయి.  అప్పటి నుంచి అంజిలమ్మ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అప్పుల ఒత్తిడి పెరగడంతో వారి ఇంటిని అమ్మి అప్పులు కట్టారు. అనంతరం తమకున్న కొద్దిపాటి భూమిలో కర్రలు పాతి, ప్లాస్టిక్‌ కవర్లను పైకప్పుగా ఏర్పాటుచేసుకొని నివాసముంటున్నారు. అయితే మూడేళ్ల కిందట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డు మెంబర్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అంజిలమ్మ పోటీ చేసి గెలుపొందింది. అయితే ఆమె కుటుంబంతో నేటికీ అదే ఇంట్లో దుర్భర జీవనాన్ని గడపటం గమనార్హం. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.