Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 16 May 2022 00:00:00 IST

ఓ అమ్మ గెలుపు కథ!

twitter-iconwatsapp-iconfb-icon
ఓ అమ్మ గెలుపు కథ!

ఆమె జీవితంలో అన్నీ ఆటుపోటులే. ప్రతీక్షణం ఒక సవాలే. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. దివ్యాంగురాలిగా జన్మించిన తన బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటూ ఒక ప్రతిభావంతురాలిగా తీర్చిదిద్దిన ఘనత ఆమెది. ఆ తల్లి పేరు ‘కలై సెల్వి’. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిమంతం. ఆమెను ‘నవ్య’ పలకరించింది.


‘‘నాకు కూతురు పుట్టిందని తెలియగానే ఎంతో ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలువలేదు. పుట్టిన ఆడపిల్ల అంధురాలు అని తెలిసి భర్త, అత్తమామలు కన్నెత్తి చూడలేదు. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలతో నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. బిడ్డను వదిలి వస్తేనే ఇంట్లోకి ప్రవేశమని అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. నెల రోజుల అనంతరం మెట్టినింటికి వెళ్లాను. వేధింపులు, ఘర్షణలు, బిడ్డను వదిలేయమని బలవంతం. అవి భరించలేక తిరిగి పుట్టింటికి చేరాను. వాళ్లలో మార్పు కోసం ఎంతో ఓర్పుతో కొన్నేళ్లు ఎదురు చూశాను. కానీ వాళ్లలో మార్పు రాలేదు. దాంతో అన్నీ నేనే అయి పాపను పెంచాలని నిర్ణయించుకున్నాను. నా పాప పేరు జ్యోతి కలై. ఈ ప్రయాణంలో నా తల్లిదండ్రులు నాకు తోడుగా నిలిచారు.  

ఓ అమ్మ గెలుపు కథ!

నా జీవితానికి ఆలంబన, నా బిడ్డకు ఆసరా

నా తండ్రి అందించిన ధైర్యం, స్థైర్యం మాటల్లో చెప్పలేనిది. ఆడ, మగ వివక్షత లేకుండా సమానంగా పెంచాలని, శారీరకంగా గానీ, మానసికంగా గానీ లోపమున్న పిల్లలని మరింత ఓర్పుతో చేరదీయాలని ప్రేమతో అనునయించాలని చెప్పేవారు. జ్యోతి ఒక స్థాయికి చేరడానికి కారణం ఆయన ఇచ్చిన తోడ్పాటే. ఎందరు హేళన చేసినా ఆయన పట్టించుకునేవారు కాదు. జ్యోతి నాలుగేళ్ల వయసులో ఆమెలోని ప్రతిభను మొట్టమొదటగా నా తండ్రే గుర్తించారు. ఆమెను సంగీతం వైపు మళ్లించి తద్వారా మార్పు తేవచ్చని ఆయన సూచించారు. 


జ్యోతి ప్రతిభ మొగ్గతొడిగింది ఇలా...

జ్యోతి ఉదయం లేచింది మొదలు తన వెంటే ఉంటూ అన్నీ చూసుకునే దాన్ని. చిన్నచిన్న విషయాలను ఓరిమితో పదే పదే చెబుతూ అవగాహన కల్పించే దాన్ని. జ్యోతికి తల్లీ, తండ్రీ, గురువు, మార్గదర్శి అన్నీ నేనే. అతికష్టంతో జ్యోతి స్కూలు చదువు పూర్తి చేయించాను. తరువాత మ్యూజిక్‌ డిప్లమో పూర్తి చేసింది. అంతే కాదు, బీఏ వయోలిన్‌ కూడా ఉత్తీర్ణురాలైంది. మ్యూజిక్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ డీఎంటీ డిస్టింక్షన్‌ సాధించింది. హిందుస్తానీ సంగీతంలో కూడా డిప్లమో పొందింది. ఇంకా కీబోర్డులో కూడా జ్యోతికి ప్రావీణ్యం వుంది. కీబోర్డ్‌లో 4వ గ్రేడ్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం మద్రాసు యూనివర్శిటీలో ఎంఏ మ్యూజిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇవి అన్నీ చెప్పినంత సులువుగా జరిగిన పనులు కావు. జ్యోతి వయసు ఇప్పుడు 21 సంవత్సరాలైనా ఆమె మానసిక ఎదుగుదల 10 సంవత్సరాలే.

ఓ అమ్మ గెలుపు కథ!

అన్నీ నేనే..

ఉదయం లేచినప్పటి నుంచి తన వెంటే ఉండి పాలు తాగించడం, తినిపించడం వగైరా పనులన్నీ నేనే స్వయంగా చేస్తాను. తనని క్లాసులకు తీసికెళ్లి, పూర్తి అయ్యేదాకా వేచివుండి తిరిగి ఇంటికి తీసుకొని రావడం వంటి పనులు చేయడంతో నాకు ఉద్యోగం చేయడానికి అవకాశం, సమయం లేకపోయాయి. జ్యోతికి కంప్యూటర్‌లో కూడా శిక్షణ ఇస్తున్నాను. అంతేకాదు, ఆమె ‘శిలంబమ్‌ పరై’ (కర్రసాము)లో కూడా శిక్షణ తీసుకుంటోంది. స్విమ్మింగ్‌ కూడా నేర్చుకుంటోంది. జ్యోతి తెలుగులో త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య పాటలు కూడా చక్కటి ఉచ్ఛారణతో పాడగలదు.


ప్రతిభ వికసించింది ఇలా..

జ్యోతికి సంగీతంలో ఉన్న ప్రతిభను గుర్తించి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ నేపధ్యగాయనిగా తమిళ చిత్రరంగానికి పరిచయం చేశారు. ‘ఆదంగతే’ అనే తమిళ చిత్రంలో ‘నిలవిన్‌ నిరముమ్‌’ అనే పాట పాడింది. ప్రత్యేక ప్రతిభావంతుల్లో ఉత్తమ నూతన గాయని అవార్డును కూడా అందుకుంది. జ్యోతి శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూ కళాహృదయుల ప్రశంసలను పొందుతున్నది. ఎన్నో టీవీ ఛానెల్స్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను కనబరుస్తోంది. కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయకులకు వయోలిన్‌ వాద్య సహకారం అందిస్తోంది. దుబాయ్‌, మలేషియా, స్కాట్‌లాండ్‌ మొదలైన చోట్ల ఇచ్చిన జ్యోతి కచేరీలకు ప్రశంసలు దక్కాయి. 1330 తిరుక్కురళ్‌ 3 గంటల 38 సెకన్లలో ఒకే సమయంలో పాడుతూ కీబోర్డ్‌ వాయించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ చోటు దక్కించుకుంది. 2019లో రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌ సమక్షంలో ప్రదర్శన ఇచ్చింది. 2021 డిసెంబరు 3న ‘వరల్డ్‌ డిజేబులిటీ డే’ (ప్రపంచ అంగ వైకల్య దినం) సందర్భంగా అత్యుద్భుత ప్రదర్శన ఇచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా న్యూఢిల్లీలో అవార్డును స్వీకరించింది.’’

 కమలాకర రాజేశ్వరి, చెన్నై


జ్యోతి నా కళ్లతో ప్రపంచాన్ని చూస్తుంది. విమానాల శబ్దాలను విని చిన్నపిల్లలా 

కేరింతలు కొడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగుల గురించి చెబితే ఆసక్తి చూపిస్తుంది. అడపిల్లని ఎవ్వరూ చులకన చేయవద్దు. అంగవైకల్యంతో జన్మించినా నిరాదరణకు గురి 

చేయవద్దు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.