పరిధి దాటితే ఉపేక్షించం!

ABN , First Publish Date - 2022-06-03T09:02:24+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవలి కాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిపై అభాండాలు వేసే సంస్కృతి ఎక్కువై పోయిందని, ఎవరైనా తమ పరిధిలో ఉన్నంత

పరిధి దాటితే ఉపేక్షించం!

స్వార్థ ప్రయోజనాలు నెరవేరలేదని తీర్పులకు వక్రభాష్యాలు

ఉన్నత స్థానాల్లోని వారిపై అభాండాలు

రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం.. ఒకరి హక్కుల కోసం కాదు

వ్యవస్థ ప్రయోజనాలే మాకు ముఖ్యం

32 జిల్లా కోర్టుల ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్‌ రమణ

మండలాల ఏర్పాటు తర్వాత అతిపెద్ద సంస్కరణ ఇదే

ఆద్యంతం తెలుగులోనే ప్రసంగించిన ఎన్వీ రమణ

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవలి కాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిపై అభాండాలు వేసే సంస్కృతి ఎక్కువై పోయిందని, ఎవరైనా తమ పరిధిలో ఉన్నంత వరకే మిత్రులని, పరిధి దాటితే ఉపేక్షించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ  హెచ్చరించారు. అలాంటి వారిని ఉపేక్షించడం కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి తెలంగాణలో 32 జిల్లా కోర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ రమణ అచ్చ తెలుగులో ప్రసంగించారు. ‘న్యాయవ్యవస్థ ఎవరో ఒకరి ప్రయోజనాల కోసం పనిచేసే వ్యవస్థ కాదు. ఇది ప్రజల ప్రయోజనాల కోసం అనునిత్యం రాజ్యాంగ బద్ధంగా, నిబద్ధతతో పని చేస్తుంది. సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థకు ముఖ్యం. ఇటీవల కాలంలో వ్యవస్థ ద్వారా స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోలేక పోయిన వారు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్పడం పరిపాటి అయింది. తద్వారా పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. పరిధులు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధి దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయాలను ఆ మిత్రులు గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే నిష్పక్షపాతమైన, స్వేచ్ఛతో కూడిన బలమైన న్యాయవ్యవస్థ అసవరం ఉంది. న్యాయ వ్యవస్థకు అందరూ మద్దతు ఇవ్వాలి. స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉంది’’ అన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 8 ఏళ్ల కింద కొత్త రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలు ఉండేవని, ఈ 8 ఏళ్ల అనుభవం ఆ సందేహాలన్నింటిని పటాపంచాలు చేసిందని వ్యాఖ్యానించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలని, ప్రజల్లో న్యాయవ్యవస్థపై అవగాహన పెంచాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అవసరం ఉన్న వారు ఆసుపత్రికి వెళ్లినట్లే న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కలగాలని చెప్పారు.

న్యాయవ్యవస్థలో తెలంగాణ కొత్త అధ్యాయం 

న్యాయ సేవల వికేంద్రీకరణతో దేశ న్యాయవ్యవస్థలో తెలంగాణ కొత్త అధ్యాయానికి తెరతీసిందని జస్టిస్‌ రమణ ప్రశంసించారు. 1980ల్లో మొదటిసారి ఎన్టీ రామారావు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని ప్రస్తావించారు. దాని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంస్కరణ ఇదేనన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1.81 లక్షల పెండింగ్‌ కేసులు ఇప్పుడు మూడు జిల్లాలకు బదిలీ అవుతాయన్నారు. దీనికి తగిన విధంగా జ్యుడీషియల్‌ అధికారులను, సిబ్బందిని కూడా నియమించుకోవాలని చెప్పారు. 194 జడ్జి పోస్టులు భర్తీ చేయాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందని, వాటిని క్లియర్‌ చేస్తానని  సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సమావేశంలో జడ్జిల నియామకాలతోపాటు సరైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఓ వ్యవస్థ ఉండాలని తాను చెప్పానన్నారు. జాతీయ న్యాయ నిర్మాణ వ్యవస్థ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని అనుకున్నప్పటికీ చిన్న అవగాహన లోపం కారణంగా కొన్ని రాష్ట్రాలు అవకాశాన్ని చేజార్చుకున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెంచామని, 19 మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించామని, మరో ఇద్దరిని వారం రోజుల్లో నియమిస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డలనే న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా నియమించాలనే తన ఆలోచనను హైకోర్టు కొలీజియం సమర్థించిందని చెప్పారు. 

ప్రజల కష్టాలకు తెరపడింది: కేసీఆర్‌ 

పాత న్యాయ జిల్లాల్లో ప్రజల కష్టాలకు ప్రస్తుతం తెరపడిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా సిద్దిపేట నుంచి జిల్లా రాజధాని సంగారెడ్డిలోని సెషన్స్‌ కోర్టుకు వెళ్లాలంటే తాము 150 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తాను కళ్లారా చూశానన్నారు. ఒక్కో నియోజకవర్గం మాత్రమే ఉన్న ములుగు, భూపాలపల్లి జిల్లాల ఏర్పాటు సమయంలో ఛత్తీ్‌సగఢ్‌ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న అధికారి సలహా తీసుకొని, మంచి ఫలితాలు వచ్చాయని నిర్ధారించుకొనే ఆ రెండు జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. సిటీ సివిల్‌ కోర్టు, రంగారెడ్డి కోర్టుల విభజన బాధ్యతను హైకోర్టు తీసుకుంటే ప్రభుత్వంగా సహకరిస్తామని చెప్పారు. 

కొత్త కోర్టుల పనితీరు భేష్‌

న్యాయవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగా ఉందని సీజే సతీశ్‌చంద్ర శర్మ, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ పేర్కొన్నారు. కొత్త జిల్లా కోర్టులతో జస్టిస్‌ డెలివరీ సిస్టమ్‌ బాగా పని చేస్తోందని ప్రశంసించారు. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జస్టిస్‌ నవీన్‌రావు, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-03T09:02:24+05:30 IST