గ్రామపంచాయతీల్లో పోషక ఉద్యానవం

ABN , First Publish Date - 2022-05-13T06:37:17+05:30 IST

జిల్లాలో పోషక ఉద్యానవనాల ఏర్పా టును ఫైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నారు.

గ్రామపంచాయతీల్లో పోషక ఉద్యానవం
సోన్‌ మండలంలోని న్యూ వెల్మల్‌లో పల్లె ప్రకృతి వనం ఇదే

పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించడమే లక్ష్యం 

డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ అమలు 

జిల్లాలో 61వేల పిల్లలకు, 6500 మంది గర్భిణులకు ఇక పోషకాహారం అందించడమే లక్ష్యం 

దశలవారీగా అన్ని గ్రామపంచాయతీలకు పోషక ఉద్యానవనాల విస్తరణ 

నిర్మల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పోషక ఉద్యానవనాల ఏర్పా టును ఫైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని దశల వారీగా అన్ని గ్రామపంచాయతీలకు విస్తరించనున్నారు. అంగ న్వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లలు, గర్భిణీ స్ర్తీలకు విలువైన ఆకుకూరలతో కూడిన పోషకాహారం అందించేందుకే పోషక ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలని తలపెడుతున్నారు. గతంలో చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో ఇ లాంటి పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో జిల్లా డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి ఈ సరికొత్త యోచనకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సరియైున పోషకాహారం అందక రక్తహీనత బారిన పడుతూ చాలా మంది పిల్లలు, గర్భిణీ స్ర్తీలు రోగాల పాలు కావడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అక్కడి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం కోసం పప్పు దినుసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆకుకూరల్లో పోషకాలు అత్యధికంగా ఉండడమే కాకుండా ఈ ఆహారం రక్తహీనతను పూర్తిగా నివారిస్తోంది. ఈ అంశా న్ని దృష్టిలో పెట్టుకొని డీఆర్డీఏ పీడీ కొత్త తరహా కార్యాచరణకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధి నిధులతో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే ఈ పల్లెప్రకృతి వనాల్లోనే పోషక ఉద్యానవనాలను కూడా అందులో ఓ భాగం చేయాలని నిర్ణయించారు. పల్లెప్రకృతివనాల్లో పోషక ఉద్యానవనం కొనసాగించేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా ఓ వాచ్‌వార్డును కూడా నియమించనున్నారు. ఇతనికి ప్రతీరోజూ ఉపాధికూలీకి అందించే తరహాలోనే వేతనం చెల్లించనున్నారు. పోషక ఉధ్యానవనం పెంపక బాధ్యత అంతా ఈ వాచ్‌వార్డ్‌కే అప్పజెప్పబోతున్నారు. మొదట కొన్ని గ్రామ పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా పోషక ఉద్యానవనాల ఏర్పా టు చేసిన అనంతరం దశలవారీగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు. పోషక ఉద్యానవనాల నుంచి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 61 వేల మంది పిల్లలకు అలాగే 6500 మందికి పైగా గర్భిణీస్ర్తీలకు ఆకుకూరలతో పాటు ఇతర పోషకాలు కలిగిన కూరగాయలను పంపిణీ చేయనున్నారు. 

జిల్లాలో 61వేల మంది పిల్లలు, 

6500 మంది గర్భీణీ స్త్రీలకు ప్రయోజనం

జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 61వేల మంది పిల్లలకు, 6500 మంది గర్భిణీ స్ర్తీలకు అలాగే 6608 మంది బాలింతలకు సైతం పోషకాహారం అందించేందుకు ఈ ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లున్నాయి. నిర్మల్‌, ఖానాపూర్‌, ముథోల్‌, భైంసా ప్రాజెక్ట్‌ల పరిధిలో 816 మెయిన్‌ అంగ న్వాడీ కేంద్రాలు, 110 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇప్పటికే ఈ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పేరిట ప్రతిరోజూ ఓ పూట భోజనాన్ని అందిస్తున్నారు. అయితే ఈ భోజనంలో సరియైున పోషకాలు ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. దీని కారణంగా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు పోషక ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. బహుళ ప్రయోజనాలతో ఈ ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టి దశల వారిగా అన్ని గ్రామ పంచాయతీలకు విస్తరించాలని యోచిస్తున్నారు. 

పల్లెప్రకృతి వనాల్లో భాగంగా..

జిల్లాలోని 396 గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం హరితహారంతో పాటు పల్లె ప్రకృతివనాల నిర్వహణ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. ప్రతిగ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతివనం, అలాగే బృహత్‌ ప్రకృతివనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు ఉపాధిహమీ నిధులతో చేపడుతున్నారు. అయితే ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతివనాలున్న కారణంగా అక్కడి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్బిణీ స్ర్తీలకు పోషకాహారం అందించేందు కోసం గానూ పోషక ఉద్యానవనాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 19 మండలాల్లోని 396 గ్రామపంచాయతీల్లో గల పల్లెప్రకృతి వనాలన్నింటిలో పోషక ఉద్యానవనాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. రాబోయే ఏడాదిలోగా అన్ని పల్లె ప్రకృతివనాల్లో పోషక ఉద్యానవనాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీని కోసం అయ్యే ఖర్చునంతా ఉపాఽధి హామీ ద్వారా భరించనున్నారు. అలాగే ప్రతి పోషక ఉద్యానవనానికి ఓ వాచ్‌వార్డ్‌ను కూడా నియమించి ఆయనకు ప్రతీనెల ఉపాధికూలీకి అందించే వేతనాన్ని చెల్లించనున్నారు. 

సమస్యగా మారిన పోషకాహార లోపం

కాగా జిల్లా వ్యాప్తంగా పోషకాహర లోపం పసి పిల్లలు , గర్భిణీలు , బాలింతలకు శాపంగా మారుతోంది. పోషకాహార లోపంతో రక్తహీనత ఏర్పడి వీరంతా రకరకాల వ్యాధులకు గురవుతుండడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పోషకాహర లోపంపై దృష్టి కేంద్రీకరించినప్పటికి అమలు చేసిన పథకాలు ఫలితాన్నివ్వలేదు. రక్తహీనతను నివారించేందుకు తీసుకున్న చర్యలు కూడా ఫలించకపోవడంతో యంత్రాంగమంతా ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించింది. నిర్మల్‌ జిల్లాలో ఈ సమస్యను అఽధిగమించేందుకు డిఆర్డీఎ పీడీ పోషక ఉద్యానవనం పేరిట సరికొత్త కార్యచరణను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో పోషక ఉద్యానవన ఏర్పాటును ఫైలేట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టబోతున్నారు. 

జిల్లాలో ప్రయోగాత్మకంగా..

జిల్లాలో ప్రయోగాత్మకంగా పోషక ఉద్యానవన ఏర్పాటును చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గల పిల్లలు అలాగే గర్భిణీలు, బాలింతలకు ఆకుకూరలతో కూడిన ఇతర బలవర్ధకమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకే వీటిని ఏర్పాటు చేస్తు న్నాం. ప్రతీ గ్రామ పంచాయతీలోని పల్లెప్రకృతి వనాల్లో పోషక ఉద్యానవనాలను డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నాం. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీల సహకారంతోనే పోషక ఉద్యానవనాల ఏర్పాటును జిల్లా అంతటికి విస్తరిస్తాం. అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే సర్కారు లక్ష్యం కావడంతో డీఆర్డీఏ ఈ దిశగా కార్యచరణ చేపట్టింది. 

Read more