‘న్యూట్రిన్‌’ ద్వారకనాథరెడ్డి మృతి

ABN , First Publish Date - 2022-09-30T07:44:31+05:30 IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త, న్యూట్రిన్‌ ఫ్యాక్టరీ కో చైర్మన్‌ వి.ద్వారకనాథరెడ్డి (98) బుధవారం రాత్రి తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో మృతి చెందారు.

‘న్యూట్రిన్‌’ ద్వారకనాథరెడ్డి మృతి

చిత్తూరు/కల్లూరు, సెప్టెంబరు 29: ప్రముఖ పారిశ్రామిక వేత్త, న్యూట్రిన్‌ ఫ్యాక్టరీ కో చైర్మన్‌ వి.ద్వారకనాథరెడ్డి (98) బుధవారం రాత్రి తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో మృతి చెందారు. పులిచెర్లకు చెందిన పారిశ్రామికవేత్త బి.వి.రెడ్డికి ఈయన రెండో కుమారుడు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం తండ్రి బీవీ రెడ్డి స్థాపించిన న్యూట్రిన్‌ ఫ్యాక్టరీలో కొంతకాలం కార్మికుడిగా శిక్షణ  పొందారు. 1964లో తండ్రి మృతి చెందడంతో ఫ్యాక్టరీ బాధ్యతలను స్వీకరించారు. ఫ్యాక్టరీకి దేశంలోనే గుర్తింపును తీసుకొచ్చారు. బహుళజాతి సంస్థలతో పోటీ పడుతూ చాక్లెట్ల తయారీలో అగ్రగామిగా నిలిచింది. అనంతరం ఆయన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో రమణార్పణం ట్రస్టును స్థాపించి ఆధ్యాత్మిక చింతనవైపు దృష్టి మరల్చారు. దీంతో ఫ్యాక్టరీ బాధ్యతలను ఆయన కుమారుడు విక్రమ్‌రెడ్డి స్వీకరించారు. వీరికాలంలో న్యూట్రిన్‌ ఫ్యాక్టరీ రూ.150కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లాభాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విరాళాలు అందిస్తూ వచ్చింది. చిత్తూరులోని సావిత్రమ్మ డిగ్రీ కళాశాల, కృష్ణవేణి జూనియర్‌ కళాశాలకు అదనపు గదులు కట్టిచ్చారు. కొన్నేళ్లుగా రమణార్పణం ట్రస్టులో ఉన్న ఆయన బుధవారం రాత్రి మృతిచెందారు. గురువారం తిరువణ్ణామలైలోని రమణార్పణం  ట్రస్టు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-09-30T07:44:31+05:30 IST