‘యూషం’ అనే పోషకాల గంజి

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

తెలుగులో గంజి తాగటం అంటే మనం ముఖం అదోలా పెడతాం. యూరోపియన్లు రోజూ పారిజ్‌ తాగుతారంటే అది గొప్ప పానీయం అనుకుంటాం. గంజిని ఇంగ్లీషులో పారిజ్‌ అంటారు అంతే!

‘యూషం’ అనే పోషకాల గంజి

తెలుగులో గంజి తాగటం అంటే మనం ముఖం అదోలా పెడతాం. యూరోపియన్లు రోజూ పారిజ్‌ తాగుతారంటే అది గొప్ప పానీయం అనుకుంటాం. గంజిని ఇంగ్లీషులో పారిజ్‌ అంటారు అంతే! ఏదైనా ధాన్యాన్ని పాలలోగానీ నీటిలోగానీ ఉడికించిన ద్రవాహారాన్ని పారిజ్‌ అంటారు. భోజనంతో (లంచ్‌ లేదా డిన్నర్‌) పాటుగా తీసుకునే పలుచని సూపులా దాన్ని తాగుతారు. గ్రోయల్‌ అనే ద్రవాహారం కూడా ఆంగ్లేయులకు ఉంది. ఇది పేదవాడి గంజి.


దీని చిక్కదనాన్ని బట్టి యూష, యవాగు, పేయ అని మూడురకాలుగా తయారు చేస్తారు. రకరకాల ధాన్యాలతో, వనమూలికలు కలిపి పారిజ్‌ కాచి ఆయా వ్యాధుల్లో ఇవ్వచ్చు. వాత రోగాలతో బాధపడేవారికి దశమూలాలతోను, అజీర్తితో బాధపడేవారికి పిప్పలి మూలంతోను, షుగరు వ్యాధితో బాధపడేవారికి తిప్పతీగ ఆకులతోనూ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి శొంఠి, పిప్పళ్లు, మిరియాలతోనూ ఈ యూష, యవాగు లేదా పేయాలను కాచుకోవచ్చు. వివిధ ధాన్యాలతో కాచిన యూషాన్ని ఆ ధాన్యం పేరుతో పిలుస్తారు. ఇది తక్షణ శక్తినిస్తుంది. శరీరంలో వేడి తగ్గించి చలవ చేస్తుంది. ఎసిడిటీని పోగొడ్తుంది. స్థూలకాయం తగ్గటానికి ఇది మంచి ఉపాయం! జీర్ణశక్తిని పెంచుతుంది. జ్వరం లాంటి వ్యాధులు వచ్చి లంకణం కట్టవలసి వచ్చినప్పుడు వాళ్లకి ఈ యూషాన్ని ఇస్తే మంచిది.


గంజిని ఆయుర్వేద గ్రంథాల్లో ‘కాంజికం’ అన్నారు. కంచి ఒకప్పుడు తమిళ, తెలుగు ప్రజల ఉమ్మడి రాజధానిగా ఉండేది. కంచిపురంలో ప్రసిద్ధి కాబట్టి తమిళులు కంచి అనీ, తెలుగు, కన్నడలలో గంజి లేదా గెంజి అనీ, సంస్కృతంలో కాంజికం, కాంజీ, కాంచిక అనీ పిలుస్తారు. 


నలుడు పాకదర్నణంలో రాజుగారికిచ్చే గంజి (యూషం) ఎలా వండాలో వివరంగా ఇచ్చాడు. దీన్ని శాలిధాన్యంతో తయారు చేస్తారు కాబట్టి, ‘శాలిధాన్య యూషం’ అన్నాడు. యూషం అంటే గరిట జారుగా కాచిన గంజి. శాలిధాన్యాన్ని కాసరవడ్లు అంటారు. ఇప్పటి బాసుమతి బియ్యం లాంటి నాణ్యమైన బియ్యం. ఈ బియ్యాన్ని నీళ్లలో రెండు మూడు సార్లు కడిగి, కొద్దిసేపు నానించి, మెత్తని పిండిగా రుబ్బాలి. ఈ పిండిలో కొద్దిగా గంజి కలిపి పలుచగా, మృదువుగా కలపాలి. ఈ మొత్తానికి 5 రెట్లు నీళ్లు పోసి గరిట జారుగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఉడుకుతూ ఉండగా ధనియాల పొడి, ఇంకా మీకు కావలసిన సుగంధ ద్రవ్యాలు కలపాలి. పొయ్యి మీంచి దించి చల్లారాక ఈ మొత్తానికి సరిపడా పెరుగు కలిపి చిలికితే చిక్కని మజ్జిగ అవుతాయి. తెల్లటి వస్త్రంలో ఈ మజ్జిగని వడగట్టాలి. ఇందులో మొగలి పూరేకులు, దబ్బాకు లేదా నిమ్మాకు, నాగకేసరాలు, దానిమ్మ పూలు, వీటిలో కావలసిన వాటిని చిన్న ముక్కలుగా చేసి కలిపితే పరిమళభరితంగా ఉంటుంది. మామిడి పండు, వాము, కమలాకాయ పూలు, వక్క పలుకులు వగైరా కూడా ఇలా కలుపుకోదగినవిగా చెప్పాడు. పెరుగుకి బదులుగా కాచిన పాలతో కూడా ఈ యూషాన్ని తయారు చేసుకోవచ్చు. పాలు లేదా పెరుగు కలిపిన అన్నాన్ని కూడా కలుపుకోవచ్చు.  


బియ్యానికి బదులుగా రాగి, జొన్న, సజ్జ, అరికలు, ఊదలు ఇలా చిరుధాన్యాలన్నింటితోనూ ఈ యూషాన్ని చేసుకోవచ్చు. దంపుడు బియ్యంతో మంచిది. ధాన్యాన్ని నానించి రుబ్బటం వలన పోషకాలను పూర్తిగా పొందగలుగుతాము. యూరోపియన్లు ఓట్స్‌తో పారిజ్‌ చేసుకుంటారు మన ప్రాంతంలో మన కోసం పండినవి మనకు అమృతాలు. వాటిని మనం వాడుకోవాలని చరకుడు స్థానికంగా దొరికే మూలికలను స్థానికులకు వాడాలనే సూత్రంలో వివరించాడు. యూషం తయారీకి చిరుధాన్యాలను ముఖ్యంగా రాగి, జొన్నల్ని వాడుకోవటం ఉత్తమం. 


గంగరాజు అరుణాదేవి


Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST