సర్వీస్‌ రోడ్‌ నిర్మించాల్సిందే!

ABN , First Publish Date - 2021-10-20T06:13:58+05:30 IST

నున్నలో గొల్లపూడి-చిన అవుటపల్లి ఆరు లైన్ల జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు.

సర్వీస్‌ రోడ్‌ నిర్మించాల్సిందే!

నున్నలో రైతుల ఆందోళన 

ఎన్‌హెచ్‌ బైపాస్‌ రోడ్డు పనులకు అడ్డగింత  

నేడు పీడీకి వినతి

విజయవాడ రూరల్‌, అక్టోబరు 19 : నున్నలో గొల్లపూడి-చిన అవుటపల్లి ఆరు లైన్ల జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. బైసాస్‌ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీ మేరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టకపోవడంతో నున్న, పాతపాడు, సీతారామపురం, పీ నైనవరం, అంబాపురం గ్రామాలకు చెందిన రైతులు విజయవాడ - నూజివీడు ఆర్‌అండ్‌బీ రోడ్డు వద్ద బైపాస్‌ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారుల హామీ మేరకు బైపా్‌సకు అంబాపురం నుంచి గన్నవరంలోని సూరంపల్లి, ముస్తాబాద గ్రామాల వరకు సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. బైపా్‌సకు రెండు వైపులా పంట పొలాలున్నాయని, పంట ఉత్పత్తులను ఇళ్లకు తీసుకెళ్లేందుకు తప్పనిసరిగా సర్వీసు రోడ్డు ఉండాల్సిందేనని పట్టుబట్టారు. సర్వీసు రోడ్డుకు బదులుగా రెండు వైపులా చేపడుతున్న ఆరడుగుల గోడ నిర్మాణంతో ఉపయోగం ఉండదన్నారు. ఈ సందర్భంగా రైతులు, నిర్మాణ సంస్థ సిబ్బంది మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అధికారులిచ్చిన డిజైన్‌ ప్రకారమే నిర్మాణ పనులు చేపడుతున్నామని, ఏదైనా ఉంటే ప్రాజెక్టు డైరెక్టర్‌తో మాట్లాడుకోవాలని చెప్పారు. అయినా స్పష్టమైన హామీ వచ్చేవరకు నిర్మాణ పనులతోపాటు గోడ నిర్మాణాన్ని నిలిపేయాలని వ్యవసాయ సలహా మండలి విజయవాడ రూరల్‌ మండల చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. అనంతరం నున్నలోని ఎన్‌హెచ్‌ఏఐ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు రైతులతో కలిసి వెళ్లారు. అయితే పీడీకే ఆ వినతిపత్రం ఇవ్వాలని అధికారులు సూచించడంతో బుధవారం విజయవాడ వెళ్లి ఎన్‌హెచ్‌ఏఐ పీడీకి వినతిపత్రం సమర్పించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. నున్న ఉప సర్పంచ్‌ కలకోటి బ్రహ్మానందరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పోలారెడ్డి చంద్రారెడ్డి, డైరెక్టర్‌ భీమవరపు ముత్తారెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ భీమవరపు శివరామిరెడ్డి, వార్డు సభ్యుడు గంపా శ్రీనివాస్‌ యాదవ్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:13:58+05:30 IST