‘ఆస్తులు విక్రయించైనా.. శిక్ష పడేలా చేస్తా’

ABN , First Publish Date - 2020-05-31T16:01:42+05:30 IST

సున్నిత మనస్కుడు, అందరితో కలుపుగోలుగా వుండే మాసవరపు..

‘ఆస్తులు విక్రయించైనా.. శిక్ష పడేలా చేస్తా’

వలంటీర్‌పై మండిపడ్డ నునపర్తి

వేధింపులు తాళలేక మాజీ మంత్రి కారు డ్రైవర్ఆత్మహత్య

శోకసంద్రమైన గ్రామం

బాధ్యుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

ఆస్తులు విక్రయించైనా నిందితుడికి శిక్ష పడేలా చేస్తా: బండారు

కేసులు ఉన్న వ్యక్తిని వలంటీర్‌గా ఎలా నియమించారో అధికారులు సమాధానం చెప్పాలి


అచ్యుతాపురం(విశాఖపట్నం): సున్నిత మనస్కుడు, అందరితో కలుపుగోలుగా వుండే మాసవరపు సన్యాసినాయుడు ఆత్మహత్యతో నునపర్తి గ్రామం శోకసంద్రమైంది. అతడి మరణాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. కుటుంబీకులతో పాటు స్థానిక ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు. సన్యాసిరావు మృతికి కారకుడైన వలంటీర్‌ నరసింగరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 


సన్యాసినాయుడు మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి నుంచి శనివారం సాయంత్రం నునపర్తి తీసుకువచ్చారు. అప్పటికే గ్రామస్థులంతా శ్మశానం వద్దకు చేరుకున్నారు. చేతికందొచ్చిన కొడుకు లేకపోతే తాము ఎలా బతకాలని సన్యాసినాయుడు తండ్రి చిన నూకరాజు, తల్లి గంగతల్లి భోరున విలపించడాన్ని చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. గ్రామ కంఠంలోని పిత్రార్జితమైన స్థలంలో గృహం నిర్మించుకుంటుంటే వలంటీర్‌ నరసింగరావు అడుగడుగునా అడ్డుపడి తమ కుమారుడ్ని మానసిక క్షోభకు గురిచేశాడని, శుక్రవారం రాత్రి కూడా ఫోన్‌ చేసి వేధించాడని నూకరాజు వాపోయారు. సన్యాసినాయుడు ఆత్మహత్యకు కారకుడైన వలంటీర్‌ నరసింగరావును కఠినంగా శిక్షించాలని కుటుంబీకులతో పాటు గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.


శిక్షపడేలా చేస్తాను: బండారు

తన ఆస్తులు అమ్మి అయినా నిందితుడికి శిక్ష పడేలా చేస్తానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సన్యాసినాయుడ్ని మానసికంగా హింసించి వలంటీర్‌ చంపేశారని ఆరోపించారు. 30 కేసులు వున్న నరసింగరావును వలంటీర్‌గా ఎలా నియమించారో అధికారులు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  



పాడె మోసిన బండారు

సన్యాసినాయుడు అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్వయంగా పాడె మోశారు. 18 సంవత్సరాలుగా తన వద్ద సన్యాసినాయుడు డ్రైవర్‌గా పనిచేశాడని, తానెప్పుడూ డ్రైవర్‌గా కాకుండా కుటుంబ సభ్యుడిగానే చూశానని అన్నారు.  


‘ఇష్టారాజ్యంగా వలంటీర్లు’

అనకాపల్లి టౌన్‌: గ్రామాల్లో వలంటీర్‌ వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఎన్టీఆర్‌ వైద్యాలయం వద్ద శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తన డ్రైవర్‌ సన్యాసినాయుడు ఆత్మహత్య చేసుకోవడానికి అతని గ్రామ వలంటీరే కారణమని దుయ్యబట్టారు. ఇంటి నిర్మాణ విషయంలో తన డ్రైవర్‌ సన్యాసినాయుడును వలంటీర్‌ తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడని, పోలీసు స్టేషన్‌, పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా వేధింపులు ఆపలేదని చెప్పారు.



నరసింగరావు వివాదాస్పదుడే..?

గతంలో విశాఖ డెయిరీ ఉద్యోగిని బెదిరించారని ఆరోపణలు

అధికార పార్టీలో ఉండడంతో చర్యలకు వెనుకడుగు


అచ్యుతాపురం: నునపర్తి వలంటీర్‌ జాగారపు నరసింగరావుకు వివాదాస్పదుడనే ముద్ర ఉంది. తాజాగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్‌ ఆత్మహత్యకు కారకుడు కావడంతో వలంటీర్‌ వ్యవహార శైలి మరోమారు చర్చనీయాంశమైంది. నేరచరిత కలిగిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి డెయిరీ ఉద్యోగి ఒకరిని చంపేస్తానని బెదిరించి రూ.3 లక్షలు డిమాండ్‌ చేసినట్టు సమాచారం. దీంతో అతను ఉద్యోగం వదిలి సబ్బవరం దగ్గర తన స్వగ్రామానికి వెళ్లిపోయినట్టు డెయిరీ సిబ్బంది తెలిపారు. కాగా మాజీ మంత్రి బండారు ఆరోపించినట్టు వలంటీర్‌పై కేసులు ఉన్నాయా? అని గ్రామస్థులను అడగ్గా, ఎన్ని కేసులు ఉన్న విషయం తమకు తెలియదని.. అయితే ఆయన అనుచరులపై పలు కేసులు వున్నాయని తెలిపారు. కానీ వారంతా వైసీపీలో వుండడంతో ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా అధికారులు విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు

Updated Date - 2020-05-31T16:01:42+05:30 IST