Abn logo
Aug 3 2020 @ 00:36AM

సంఖ్యా వచనం

పదమూడో ఎక్కం మూడో మెట్టు మీదే

బొక్క బోర్లా పడ్డ రోజున

లెక్కలకీ నాకూ చుక్కెదురని అర్థమైంది

అంక గణితం, బీజ గణితం తెలతెల్లటి దుస్తుల్లో

ఆర్కిమెడిస్‌, పైథాగరస్‌ల వీపులెక్కి 

స్వప్న నృత్యం చేసిన రాత్రుల్లో

దడుపు జ్వరం పట్టుకొంది

పీటీఆర్‌ బై హండ్రెడ్‌ పీచమణచలేక

కాలమూ దూరమూ మధ్య మతలబేమిటో బోధపడక

ఆన్సర్‌కి ఆమడ దూరంలో తచ్చాడుతుంటే

వీడికి జన్మలో ట్వంటీ బై హండ్రెడ్‌ కన్నా రావని

లెక్కల పంతులుగారు ప్రైవేట్‌లోనే బల్ల గుద్దేశారు

అయితే, రోజులు మారి పంతులు గారి లెక్క పటాపంచలైంది


ఇప్పుడు నా చుట్టూ కిందా పైనా రేయింబగళ్లు 

కళ్లల్లో కలల్లో లెక్కలే లెక్కలు

కాలం గొప్ప గణిత బోధిని

అది జీవిత వర్తమానాన్ని అంకెల్లోకి కుదించింది

తిరుగు లేని మొత్తాలను భిన్నం చేసింది

అవిచ్ఛిన్న భావ దర్పణాలన్నీ ఛిన్నాభిన్నం చేసింది

అసంఖ్యాక మానవ సమూహాల్ని అవలీలగా విభాగించి

ఒక్కొక్క చీకటిదీవిగా శేషం మిగిల్చి చూపించింది

ఇవాళ మృత్యుఘంటికల అసలు ఇంతైతే

రేపు చక్రవడ్డీతో మరెంత అవుతుందో తేల్చిచెప్పింది

శబ్దాలన్నీ శమించినాక కొమ్మల్లో కొండల్లో అడవుల్లో అర్ణవాల్లో 

చెలరేగిన ఆనందారావాల హెచ్చవేత తేలిందిప్పుడు

స్వీయకేంద్రమై తనను తప్ప సమస్తాన్నీ దుంపనాశనం చేసిన 

మానవకోటి చిట్టచివరి స్క్వేర్‌ రూట్‌ తెలిసింది


నేనిప్పుడు అంకెల్లో  మృత్యువాసన పసిగట్టగలను

ఒకే ఒక్క అదృశ్య రూపాతీత రూపిణి

పదులు వందలు వేలు లక్షలుగా

పరివృద్ధి చెందే చైన్‌ రియాక్షన్‌ మూల సూత్రం విప్పగలను

తుప్పు పట్టిన ఖండాంతర క్షిపణుల ముందు

బూజు పట్టిన అణ్వస్త్ర పాదాలవద్ద

నిస్పృహతో కుప్పగూలిన మహా మకుటధారుల

పీడకలల కూడికెంతో,

గ్రేట్‌, మెగా, సూపర్‌, సుప్రీమ్‌, లెజండరీ వగైరా 

స్వయంకల్పిత వీర విశేషణాల డొల్లలన్నీ

ఒకానొక అణుసుందరి ఖడ్గధారకి తెగినప్పటి

తుత్తునియల మొత్తమెంతో

నాకు తెలుసు

పాషాణదినాల్లో అరణ్యరాత్రుల్లో పయనిస్తున్న 

నిస్సహాయ మూర్తుల గుండె చప్పుళ్ల వేగమూ,

న్యూటన్‌ కిస్సింగ్‌ నెంబర్‌ ఒక్కొక్క రెండు చేతుల జీవిని హత్తుకుంటూ

అనంతానికి చేర్చుతున్న వైనమూ తెలుసు 

నేనిప్పుడు

పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు సంఖ్యనైనా

ఒక్కొక్క నిలువెత్తు మృతదేహంగా 

క్రమం తప్పక లెక్కించగలను

అహో! 

నేనిప్పుడు ఈ చిందర సుందర వందర భూగోళాన్ని

బ్రహ్మాండమైన సున్నాలాగా గుర్తించగలను 

పాపినేని శివశంకర్‌

85008 84400

Advertisement
Advertisement
Advertisement