Kuwait: షాకింగ్.. కువైత్‌లో పెరుగుతున్న డ్రగ్స్ వాడే అమ్మాయిల సంఖ్య!

ABN , First Publish Date - 2022-08-05T15:20:06+05:30 IST

గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) మాదక ద్రవ్యాల విషయంలో ఎంతటి కఠిన చట్టాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Kuwait: షాకింగ్.. కువైత్‌లో పెరుగుతున్న డ్రగ్స్ వాడే అమ్మాయిల సంఖ్య!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) మాదక ద్రవ్యాల విషయంలో ఎంతటి కఠిన చట్టాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రగ్స్‌ (Drugs)తో పట్టుబడితే ఇక అంతే సంగతులు. అయితే, గతకొంత కాలంగా ఈ దేశాల్లో మాదక ద్రవ్యాల వినియోగం క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కువైత్‌ (Kuwait)లో చాపకింద నీరులా మత్తు పదార్థాల వినియోగం విస్తరిస్తున్నట్లు సమాచారం. అందులోనూ డ్రగ్స్ వాడుతున్న అమ్మాయిలు పెరుగుతున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్‌ (DCGD)కు వచ్చిన కేసుల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా వారానికి 120 వరకు మాదక ద్రవ్యాల కేసులు నమోదైతే అందులో మూడోవంతు అమ్మాయిలే ఉంటున్నారట. డైలీ 10 నుంచి 15 డ్రగ్ కేసులు వస్తుంటే.. వీకెండ్స్‌లో మాత్రం భారీగా కేసులు నమోదవుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎక్కువగా వినియోగదారులు లారికా, షాబు (Crystal meth), హషీష్ లేదా మద్యం వంటి మాదక మరియు మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. 


ఇటీవల దేశవ్యాప్తంగా వినియోగదారులకు డ్రగ్స్ స్వేచ్ఛగా దొరుకుతున్నట్లు డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్‌ (DCGD) గుర్తించింది. దీంతో ఈ విష సంస్కృతిని ఎదుర్కోవడానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్‌ (DCGD) అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన డ్రగ్ డీలర్లను గుర్తించి అదుపు చేయడంతోపాటు దేశ సరిహద్దులోని భూ, సముద్ర మార్గాల ద్వారా పెద్దఎత్తున మాదక ద్రవ్యాల ప్రవేశానికి అడ్డుకట్ట వేయగలిగింది. లారికా, హషీష్ వంటి మాదక ద్రవ్యాలను ఉపయోగించే అమ్మాయిలు అధిక సంఖ్యలో ఉన్నారట. ఇక సెంట్రల్ జైలు నుంచి విడుదలైన డ్రగ్స్ వాడేవారిలో ఎక్కువ మంది జైలులో డ్రగ్స్ లభ్యం కావడం వల్ల మళ్లీ దానికి బానిసై అస్వస్థతకు గురయ్యారని అధికారులు నిర్ధారించారు. సెంట్రల్ జైలులో ఉన్న మాదకద్రవ్యాల డీలర్లు కటకటాల వెనుక ఉండి కూడా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుండడం షాకింగ్‌గా ఉందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ చీకటి దందాకు ప్రారంభంలోనే అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్‌లో చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-08-05T15:20:06+05:30 IST