కొల్హాపూర్ ఆలయంలో భక్తుల ప్రవేశంపై పరిమితి

ABN , First Publish Date - 2021-12-06T21:36:31+05:30 IST

ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా కోవిడ్ థర్డ్ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయనే భయాందోళనల..

కొల్హాపూర్ ఆలయంలో భక్తుల ప్రవేశంపై పరిమితి

కొల్హాపూర్: ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా కోవిడ్ థర్డ్ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయనే భయాందోళనల నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రఖ్యాత కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో భక్తుల ప్రవేశంపై పరిమితి విధించారు. ఈ మేరకు పశ్చిమ మహారాష్ట్ర దేవస్థాన్ సమితి (పీఎండీఎస్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గంటకు 1,500 మంది భక్తులను ఆలయంలోకి అనుమతిస్తుండగా, ఆ సంఖ్యను 1,200కు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఆలయ ఆవరణలో రద్దీని తగ్గించి, కోవిడ్ నిబంధనల సక్రమ అమలుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నటు పీఎండీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.


పీఎండీస్ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రేఖావర్ గత నవరాత్రి నుంచి విజిటర్ల కోసం ఇ-పాస్ సిస్టంను కూడా ప్రారంభించారు. ఒక్కో ఇ-పాస్‌పైన ముగ్గురు విజిటర్లను ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి గంటకు జారీ చేసే ఇ-పాస్‌లను 500 నుంచి 400కు తగ్గించారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. ఆలయం వేళలు కుదించడం కంటే, వేళలు పెంచి, భక్తుల సంఖ్యను తగ్గించడానికే తాను ప్రాధాన్యం ఇస్తున్నట్టు రేఖావర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆలయం వేళలు యథాప్రకారం అమలు చేస్తున్నామని, భక్తుల రద్దీ పెరిగితే ఆలయం వేళలు కూడా పెంచే అవకాశం ఉందని చెప్పారు.


పీఎండీఎస్ సెక్రటరీ శివరాజ్ నైఖ్వాడ్ మాట్లాడుతూ, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి వేలాది భక్తులు వస్తుంటారని, ప్రస్తుతం అక్కడ ఒమైక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నందున భక్తుల స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారితే ఆలయంలోకి అనుమతించే భక్తుల సంఖ్యను కూడా తగ్గిస్తామన్నారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఇ-పాస్‌ను కొనసాగిస్తున్నందున ఇ-పాస్ లేని వారిని ఆలయంలోకి అనుమతించమని చెప్పారు. ఇ-పాస్ సిస్టంను స్థానిక వ్యాపారులు ఇటీవల వ్యతిరేకించారు. ఇందువల్ల తమ ఆదాయం దెబ్బతింటోందని అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే, ఇది నమ్మకాలకు సంబంధించిన అంశం కాదని, ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికుల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని నైఖ్వాడ్ వివరించారు.

Updated Date - 2021-12-06T21:36:31+05:30 IST