నేటి నుంచి నుమాయిష్‌.. నో మాస్క్‌.. నో ఎంట్రీ

ABN , First Publish Date - 2022-01-01T15:13:59+05:30 IST

నేటి నుంచి నుమాయిష్‌.. నో మాస్క్‌.. నో ఎంట్రీ

నేటి నుంచి నుమాయిష్‌..  నో మాస్క్‌.. నో ఎంట్రీ

హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో శనివారం సాయంత్రం 5 నుంచి 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) ప్రారంభమవుతుందని జాయింట్‌ పోలీసు కమిషనర్‌, సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ పి.విశ్వ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం సొసైటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ సెక్రటరీ ఆదిత్య మార్గం, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ డి.ప్రభా శంకర్‌, వినయ్‌ కుమార్‌తో కలిసి డీసీపీ  మాట్లాడారు. నుమాయిష్‌కు అన్ని శాఖలూ అనుమతి ఇచ్చాయన్నారు. కొవిడ్‌ నిబంధనలను పకడ్బందీగా పాటించాలని సొసైటీకి సూచించినట్లు తెలిపారు. నుమాయిష్‌ జరిగినన్ని రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు.


ప్రారంభించనున్న గవర్నర్‌

గవర్నర్‌ తమిళి సై నేటి సాయం త్రం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు టి.హరీశ్‌రావు, గౌరవ అతిథులుగా మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 


1500 స్టాళ్లు

సందర్శకులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని ఎగ్జిబిషన్‌ సొసైటీ సెక్రటరీ ఆదిత్య మార్గం తెలిపారు. ఎంట్రీ రూ.30 అని పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మైదానంలో కేవలం 1500 స్టాళ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చామన్నారు. 46 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కులో చిన్నారులను అలరించడానికి 16 రకాల గేమ్స్‌ రైడర్లు ఉన్నాయన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు మైదానంలోకి సందర్శకులను వాహనాలతో అనుమతిస్తామన్నారు. కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్ర వాహనానికి రూ.100 రుసుంగా పేర్కొన్నారు. వాహనదారులు మైదానమంతటా తిరిగి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. 

Updated Date - 2022-01-01T15:13:59+05:30 IST