నిధుల మళ్లింపుపై ఉద్యమం

ABN , First Publish Date - 2021-12-02T06:42:32+05:30 IST

నిధుల మళ్లింపుపై ఉద్యమం

నిధుల మళ్లింపుపై ఉద్యమం
ఉయ్యూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన

 ప్రభుత్వానికి సర్పంచ్‌ల హెచ్చరిక

ఉయ్యూరు, డిసెంబరు 1 : పంచాయతీల నిధుల  మళ్లింపుపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని  సర్పంచ్‌లు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం  గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరు  చేసిన నిధులను రాష్ట్రప్రభుత్వం దారిమళ్లించడంపై   పంచాయతీరాజ్‌ చాంబర్‌ పిలుపు మేరకు మండల సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్‌లు,  చాంబర్‌ వ్యవ స్థాపక అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఉయ్యూరులో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12,918 పంచాయతీల నుంచి రెండున్నర సంవత్సరాలలో  రూ. 3వేల కోట్లకు పైగా  నిధులు మళ్లించ డంతో పంచాయతీలు పారిశుధ్య పనులకు కూడా రూపా యి లేని దుస్థితిలో  సర్పంచ్‌లు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల  పనుల కోసం  కేంద్రప్రభుత్వం  14, 15 ఆర్థిక సంఘాల ద్వారా  కేటాయించిన నిధులను దారి  దోపిడి దారుల్లా తరలించుకు పోవడం దారుణంగా పేర్కొన్నారు. నిధులు లేక గ్రామపంచాయతీలు నిర్వీర్యమైపోయి, సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు మళ్లించడం రాజ్యాంగ విరుద్ధమని, పంచాయతీ బోర్డు తీర్మానం లేకుండా పంచాయతీలా ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మోసం చేయడమే అని ఆరోపించారు. పంచాయతీలకు రాష్ట్రం నుంచి వచ్చే పలు నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్న వాటిని కూడా తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నిధుల మళ్లింపు సమస్యను వెంటనే పరిష్కరించి తీసుకున్న నిధులు తిరిగి ఇవ్వకపోతే ఢిల్లీవెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చినఓగిరాల, జబర్లపూడి, సాయిపురం, మర్రివాడ, గోపువానిపాలెం సర్పంచ్‌లు యెనిగళ్ల శిరీష,  సూరపనేని ప్రసాద్‌,  బాషా,  ప్రాన్సిస్‌,  భూషయ్య,  వార్డు సభ్యులు, టీడీపీ నాయకులు కుటుంబరావు, వీరశ్రీనివాస్‌, ఫణి, తేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T06:42:32+05:30 IST