Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 01:44:24 IST

అణు హెచ్చరిక

twitter-iconwatsapp-iconfb-icon
అణు హెచ్చరిక

రష్యాకు ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను వాడతాం

పశ్చిమదేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వార్నింగ్‌

ఉక్రెయిన్‌కు అదనంగా 3 లక్షల మంది సైన్యం

ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకొని పశ్చిమ దేశాలు రష్యాతో పరోక్షంగా యుద్ధం చేస్తున్నాయి

రష్యా వినాశనమే వాటి లక్ష్యమని వ్యాఖ్య

ఇప్పటివరకు 5,937 మంది రష్యా సైనికుల మృతి


మాస్కో, సెప్టెంబరు 21: ఉక్రెయిన్‌లో ఒక్కో ప్రాంతం చేజారుతున్న వేళ.. యుద్ధంలో ఉక్రెయిన్‌ పైచేయి సాధిస్తున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి 3 లక్షల మంది రిజర్వు  సైనికులను పంపిస్తామన్నారు. ‘ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు కేవలం ఉక్రెయిన్‌ సైన్యంతో మాత్రమే పోరాడటం లేదు. మొత్తం పశ్చిమ దేశాల సైనిక శక్తిని ఎదుర్కొంటున్నాయి. వారిపై పోరాడాలంటే మరిన్ని బలగాలను అక్కడికి పంపక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. బలగాల తరలింపు బుధవారం నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఇప్పటికే సంతకం చేసినట్లు వెల్లడించారు. బుధవారం పుతిన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు.


పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకొని రష్యాపై పరోక్ష యుద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ‘రష్యాను బలహీనం చేసి, విభజించి, నాశనం చేయడమే వాటి లక్ష్యం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాపై అణుదాడులు జరగవచ్చంటూ పశ్చిమ దేశాలు పదే పదే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాయని పుతిన్‌ ఆరోపించారు. అణుయుద్ధం రావచ్చంటూ నాటో దేశాల అధినేతలు, అత్యున్నత అధికారులు చేసిన ప్రకటనలను గుర్తు చేశారు. ‘రష్యాను బెదిరించేవారికి నేను ఒక్కటే చెప్తున్నా. రష్యా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. నాటో దేశాల కంటే శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ మా దగ్గర ఉంది. రష్యాకు ముప్పు ఉందని భావించినప్పుడు వాటన్నింటినీ మేం తప్పక ఉపయోగిస్తాం. ఈ విషయంలో నేను జోక్‌ చేయడం లేదు’ అని హెచ్చరించారు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించి దాదాపు ఏడు నెలలు గడిచింది. రష్యా మొదట్లో ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. అయితే, ఈ నెల ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌ మళ్లీ ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ తాజా ప్రకటన చేశారు. 


రేపటి నుంచి నాలుగు ప్రాంతాల్లో రెఫరెండం

ఉక్రెయిన్‌ నుంచి విముక్తి కల్పించిన ప్రాంతాల్లో ప్రజలను కాపాడేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. పుతిన్‌ ప్రకటనకు అనుగుణంగానే ఆయా ప్రాంతాలను విలీనం చేసుకునేందుకు రష్యా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తమ నియంత్రణలో ఉన్న డోనెట్స్క్‌, లూహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌ ప్రాంతాల్లో శుక్రవారం నుంచి రెఫరెండం నిర్వహించనుంది.  


రిజర్వు బలగాలకూ సైనిక హోదా

పుతిన్‌  ప్రకటన అనంతరం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సైన్యంలో పనిచేసిన వారిని రిజర్వు సైనికులుగా విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరికి పూర్తి స్థాయి సైనిక హోదా లభిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో 5,937 మంది రష్యా సైనికులు చనిపోయారని షోయిగు వెల్లడించారు. మార్చి తర్వాత రష్యా సైనికుల మరణాలపై అధికారికంగా ప్రకటన చేయడం ఇదే తొలిసారి. 


రష్యా నవ్వులపాలు

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విఫలమైందనడానికి పుతిన్‌ ప్రకటనే సంకేతమని ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబారి బ్రిడ్జెట్‌ బ్రింక్‌ అన్నారు. రష్యా ఆక్రమణ విఫలమవుతోందని బ్రిటన్‌ డిఫెన్స్‌ సెక్రెటరీ బెన్‌ వాలెస్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.