ముదినేపల్లితో ఎన్టీఆర్‌ అనుబంధం

ABN , First Publish Date - 2022-05-28T06:30:03+05:30 IST

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు ముదినేపల్లి ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది.

ముదినేపల్లితో ఎన్టీఆర్‌ అనుబంధం
ఎన్టీఆర్‌ చిన్నతనంలో ఎక్కువగా గడిపిన గోకినంపాడు

శత జయంతి సందర్భంగా.. 

ముదినేపల్లి, మే 27 :  టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు ముదినేపల్లి ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది. తన చిన్నతనంలో తరచూ గోకినంపాడులోని తన పిన తండ్రి నందమూరి నాగయ్య ఇంటికి వచ్చేవారు. ప్రతి వేసవి సెలవుల్లోను అక్కడే  గడిపేవారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు సినీ రంగ ప్రముఖులతో అనుబంధం ఉంది. దర్శక, నిర్మాతలు దుక్కిపాటి మధుసూదనరావు, తమ్మారెడ్డి భరద్వాజ సారథ్యంలో ఎన్టీఆర్‌ ఎన్నో సినిమాల్లో నటించారు. దుక్కిపాటిది పెయ్యేరు కాగా, తమ్మారెడ్డిది చినపాలపర్రు.   సీనియర్‌ రాజకీయ నాయకుడు పిన్నమనేని కోటేశ్వరరావుతో కొల్లేరు సరస్సు అభివృద్ధిపై 1970లోనే ఎన్టీఆర్‌ చర్చించారట. రాజకీయ రంగ ప్రవేశం చేశాక ముదినేపల్లికి చెందిన ప్రముఖులతో ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యంగా ఉండేవారు. 1985 నుంచి స్థానిక రాజకీయ ప్రముఖుడు ఎర్నేని ఉమా ప్రసాద్‌కు పార్టీలో ఎన్టీఆర్‌ ప్రాధాన్యమిచ్చేవారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడులో అన్నపూర్ణ క్యాంటీన్‌ నిర్వహణ బాధ్యతలను ఉమా ప్రసాద్‌కే ఎన్టీఆర్‌ అప్పగించే వారు. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే ఎర్నేని సీతాదేవికి ఎన్టీఆర్‌ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి కీలకమైన విద్యాశాఖను అప్పగించారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ తొలిసారి వచ్చి ముదినేపల్లిలో ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కంచుకోట తదితర సినిమాలు నిర్మించిన ఉప్పలపాటి విశ్వేశ్వరరావు స్వగ్రామం గోకినంపాడు. ఆయన ఎన్టీఆర్‌కు మేనత్త కుమారుడు.

Updated Date - 2022-05-28T06:30:03+05:30 IST