ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2021-01-19T06:18:59+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి

ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి
ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

అన్ని ప్రాంతాల్లోనూ అన్న స్మరణ

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు 

సభలు, రక్తదానాలు, అన్నదానాలు

కనిగిరి, పర్చూరుల్లో భారీగా నిర్వహణ

అన్ని ప్రాంతాల్లో పాల్గొన్న ముఖ్యనేతలు


ఒంగోలు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా వందలాది ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. జిల్లాలో అన్నిప్రాంతాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలదండలు వేయడంతోపాటు పెద్దఎత్తున వర్ధంతి సభలు, రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. చాలాచోట్ల ఉదయం 8 నుంచి రాత్రి వరకూ కార్యక్రమాలు కొనసాగాయి. వేలసంఖ్యలో ప్రజలు హాజరై ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ వర్ధంతి సభతోపాటు రక్తదాన శిబిరం, భారీగా అన్నదానం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీతోపాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో ఇసుకదర్శి సమీపంలోని ఆయన క్యాంపు ఆఫీసు వద్ద భారీగా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఏలూరితోపాటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కూడా పాల్గొన్నారు. అద్దంకి  నియోజకవర్గంలోని బల్లికురవలో నిర్వహించిన కార్యక్రమంలో ఉదయం పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్‌ సాయంత్రం పలు గ్రామాల్లో జరిగిన సభలకు హాజరయ్యారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి కొండపితోపాటు సింగరాయకొండ, తూర్పునాయుడుపాలెంలో పాల్గొనగా చీరాల టీడీపీ ఇన్‌చార్జి యడం బాలాజీ చీరాలలో ఎన్టీఆర్‌ విగ్రహానికి స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో కనిగిరిలో వర్ధంతి జరిగింది. భారీ ఎత్తున సభ, రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.  ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని మద్దిరాలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడులలో జరిగిన కార్యక్రమాల్లో ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.  గిద్దలూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి..  కందుకూరు, గుడ్లూరులలో జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం పాల్గొన్నారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నియోజకవర్గ సమన్వయకర్త పమిడి రమేష్‌లు, ఎర్రగొండపాలెంలో సీనియర్‌ నేత డాక్టర్‌ రవీంద్ర, మార్కాపురంలో ముఖ్యనేతలు వక్కలగడ్డ మల్లికార్జున, శాసనాల వీరబ్రహ్మం హాజరయ్యారు. ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న టీడీపీ ముఖ్యనేతలు గత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనియాడటంతోపాటు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పోకడపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో శ్రేణులు పనిచేసి తిరిగి రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో పట్టు నిరూపించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. 



Updated Date - 2021-01-19T06:18:59+05:30 IST