విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-22T06:00:07+05:30 IST

పెదపాడు గ్రామం పెదపాడు గ్రామంలో బస్టాండ్‌ సమీపంలో తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే రహదారిలో చెరువును ఆనుకుని 1994లో మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు హయాంలో ఏర్పాటు చేసిన జెండాదిమ్మ వద్ద పార్టీ కార్యక్రమాలకు టీడీపీ జెండాను ఎగురవేసేవారు.

విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద గుమిగూడిన కార్యకర్తలు

అనుమతి లేదంటూ  ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపునకు అధికారుల ప్రయత్నం

పెద్దసంఖ్యలో గుమిగూడిన టీడీపీ శ్రేణులు

విగ్రహానికి ముసుగు వేయడంతో 

వివాదానికి తాత్కాలిక తెర


పెదపాడు, మే 21 : పెదపాడు గ్రామం పెదపాడు గ్రామంలో బస్టాండ్‌ సమీపంలో తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే రహదారిలో చెరువును ఆనుకుని 1994లో మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు హయాంలో ఏర్పాటు చేసిన జెండాదిమ్మ వద్ద పార్టీ కార్యక్రమాలకు టీడీపీ జెండాను ఎగురవేసేవారు. అనంతరం దిమ్మపై ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు కోసం పార్టీ శ్రేణులు శ్లాబును ఏర్పాటు చేశారు. అయితే కొన్ని కారణాలతో విగ్రహా ఏర్పాటు కాలేదు. అప్పటి నుంచి జెండాదిమ్మ ప్రాంతం ఖాళీగానే ఉంది. అయితే త్వరలో జరగబోయే ఎన్టీఆర్‌ 100వ జయంతిని పురస్కరించుకుని ఆ ప్రాంతంలో విగ్రహా ఏర్పాటులో భాగంగా 19వ తేదీ రాత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పెట్టారు. అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ కొంతమంది స్థానికంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగింపునకు తహసీల్దారు ఇందిరాగాంధీ, ఎస్సై నాగబాబుల సమక్షంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది జేసీబీ సాయంతో చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో టీడీపీ నాయకులతో అధికారులు మాట్లాడారు. అనుమతి తీసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకో వాలని, ఇందులో భాగంగానే విగ్రహాన్ని తొలగించనున్నట్లుగా అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతులు తీసుకుంటామని టీడీపీ నాయకులు వ్యవధి కోరడంతో అప్పటి వరకు విగ్రహానికి ముసుగు వేయాలన్న తహసీల్దారు ఆదేశాలతో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది విగ్రహానికి ముసుగు వేశారు. దీంతో  వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. 


Updated Date - 2022-05-22T06:00:07+05:30 IST