మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలి: మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు

ABN , First Publish Date - 2022-01-29T06:31:21+05:30 IST

మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలి: మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు

మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలి: మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు

జి.కొండూరు, జనవరి 28: పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల నుకుంటున్న ప్రభుత్వం విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేసి జిల్లా ప్రజలందర్నీ గందరగోళానికి గురి చేయడం సబబు కాదని మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాను రెండుగా విభజించి విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెట్టే బదులు ఆయన స్వగ్రామం నిమ్మకూరు ఉన్న మచిలీపట్నానికి ఆయన పేరు పెడితే బాగుంటుందన్నారు. పామర్రు పాదయాత్రలో అక్కడి ప్రజలకు జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని హామీ ఇచ్చిన జగన్‌ ఇప్పుడు ఆపేరును విజయవాడకు పెట్టించడమేమిటని ప్రశ్నించారు. కృష్ణానది ప్రవహించే విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెట్టడం ఏమాత్రం సవ్యంగా లేవన్నారు. అటుది ఇటు.. ఇటుది అటు మార్చి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేసి, అసంతృప్తి రగిల్చేలా ఉందన్నారు.

కొడాలి నాని నోరు మెదపరే?

పదే పదే ఎన్టీఆర్‌ పేరు వల్లించే మంత్రి కొడాలి నాని, ఎన్టీఆర్‌ పేరును ఆయన పుట్టిన ప్రాంతానికి పెట్టకుంటే ఎందుకు నోరు మెదపడం లేదని జ్యేష్ఠ ప్రశ్నించారు. నాని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్‌ రాష్ట్రానికి చేసిన సేవలను సీఎం జగన్‌ గుర్తు చేసుకుని, అసెంబ్లీలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి చేతులు దులుపుకోకుండా కేంద్రంతో మాట్లాడి పట్టుబట్టి ఒత్తిడి తెచ్చి భారతరత్న వచ్చేలా కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని చెప్పుకుంటా పదేపదే చంద్రబాబు, లోకేష్‌ను తిట్టి జగన్‌ మెప్పు పొందుతున్న కొడాలి నాని, లక్ష్మీ పార్వతి, వల్లభనేని వంశీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించి ప్రజల మన్ననలు పొందిన రోజున ఎన్టీఆర్‌ ఆత్మ శాంతి స్తుందన్నారు. అంతే తప్ప విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినంత మాత్రా న కాదని, విషయాన్ని ఆ నేతలు గ్రహించాలని జ్యేష్ఠ హితవు పలికారు. 


Updated Date - 2022-01-29T06:31:21+05:30 IST