భారత రత్న కాదు.. ప్రపంచ రత్న ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-06-27T05:27:02+05:30 IST

తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్‌ ఎన్నో పాత్రలను అవలీలగా పోషించారని, చలన చిత్ర రంగంలో ప్రపంచంలోనే గొప్పగా నటించిన ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదని అభిమానులు బాధపడవద్దని ఆయన ప్రపంచ రత్న అంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

భారత రత్న కాదు.. ప్రపంచ రత్న ఎన్టీఆర్‌
సెలబ్రిటీ అవార్డును దర్శకుడు రాఘవేంద్రరావుకు అందజేస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్‌

ఎన్టీఆర్‌ శతాబ్ది చలన చిత్ర పురస్కారోత్సవంలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు 

తెనాలి అర్బన్‌, జూన్‌ 26: తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్‌ ఎన్నో పాత్రలను అవలీలగా పోషించారని, చలన చిత్ర రంగంలో ప్రపంచంలోనే గొప్పగా నటించిన ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదని అభిమానులు బాధపడవద్దని ఆయన ప్రపంచ రత్న అంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పేర్కొన్నారు. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్‌ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయనకు ఆదివారం ఎన్టీఆర్‌ శతాబ్ది చలన చిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. నాజరుపేటలోని ఎన్‌వీఆర్‌ కన్వెషన్‌లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ తన సినీ జన్మకు ఎన్టీఆర్‌ కారణమని ఈ స్థాయికి చేరేందుకు అన్నగారి ఆశీర్వాదం ఉందన్నారు. ఈ పురస్కారాన్ని పైలోకంలో ఉన్న ఎన్టీఆర్‌ పంపినంత ఆనందంగా ఉందని చెప్పారు. ఏడాది పాటు తెనాలిలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు చేయడం అభినందనీయమన్నారు. 1963లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా భీముని పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌కు క్లాప్‌ కొట్టానని, ఆయనతో తీసిన 12 సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయని చెప్పారు. నందమూరి హరికృష్ణ కోడలు దీపికా జయరామ్‌ మాట్లాడుతూ పేదలు, మహిళల కోసం ఎన్టీఆర్‌ నిర్ణయాలు సంచలనం కలిగించాయని అవే పథకాలు ఈనాటికి పేదలకు అందుతున్నాయన్నారు. మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ అవార్డును సినీ రంగంలో అంతే గొప్ప దర్శకుడికి అందించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే భావంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటు పడ్డారని చెప్పారు. సందేశాత్మక చిత్రాలు అందించి మంచి దర్శకునిగా పేరు పొందిన రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్‌ శతాబ్ది పురస్కారం అందించడం అభినందనీయమన్నారు. సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడుతూ 1975లో షోలే చిత్ర రికార్డులను అడవి రాముడు సినిమా బద్దలు కొట్టిందని, సినీ రంగానికి గ్రామర్‌ను గ్లామర్‌ను తెచ్చిన ఘనత  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకే దక్కుతుందన్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది వరప్రసాద్‌ దర్శకుడు రాఘవేంద్రరావును సెలబ్రిటీ అవార్డుతో సన్మానించారు. డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తి, సినీ నిర్మాత కేవీ నారాయణ, వడ్లమూడి పూర్ణచంద్రరావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, దేవినేని రమాదేవి సభలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T05:27:02+05:30 IST