న్యూఢిల్లీ, మే 28(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం ఎన్టీఆర్ కీర్తి అజరామరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ శనివారం సందేశమిచ్చారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘విభిన్న రంగాల్లో మహా నాయకుడిగా విశ్వ విఖ్యాతులైన ఎన్టీఆర్ నూరవ ఏట ప్రవేశించారు. 50వ దశకం ఆరంభంలో తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా 80వ దశకం వరకు తెలుగువాళ్లను మదరాసీలనే పిలిచేవారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన తరువాతే తెలుగు జాతికి విశిష్ఠమైన గుర్తింపు లభించనారంభించింది. అఖిలాంధ్ర ప్రజానీకం నీరాజనాలుపట్టి ఆయనకు అపూర్వ విజయం ప్రసాదించి దేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయన పుట్టిన రోజులు జరుపుకుంటూనే ఉంటారు. తెలుగు ప్రజలు ఎన్నెన్నో శత జయంతులు జరుపుతూనే ఉంటారు. ఆయన కీర్తి అజరామరం. ఆ మహానాయకుడికి, మార్గదర్శకుడికి నా నమస్సులు’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు.