ఎన్టీఆర్‌ పోయి.. వైఎస్సార్‌!

ABN , First Publish Date - 2022-09-21T08:09:35+05:30 IST

ఎన్టీఆర్‌ పోయి.. వైఎస్సార్‌!

ఎన్టీఆర్‌ పోయి.. వైఎస్సార్‌!

హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేశారు

రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో కేబినెట్‌ ఆమోదం.. నేడు అసెంబ్లీలో సవరణ బిల్లు!

నాడు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉందని ప్రకటన.. ఆయన పేరుతో జిల్లా పెట్టామంటూ గొప్పలు

ఇప్పుడు వర్సిటీలో పేరు మాయం.. వైద్య వర్సిటీతో ఎన్టీఆర్‌కు బలమైన బంధం

వర్సిటీ ఏర్పాటు, జాతీయ స్థాయి గుర్తింపు.. మరణానంతరం వర్సిటీకి ఆయన పేరు

సీఎంలు మారినా 24 ఏళ్లుగా అదే కీర్తి.. వైఎ్‌సకు ఏ సంబంధమూ లేకున్నా ఆయన పేరు


హెల్త్‌ యూనివర్సిటీతో వైఎ్‌సకు ఎలాంటి సంబంధం, అనుబంధమూ లేదు. దీనిని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్‌. దీనికి గుర్తింపు తీసుకొచ్చిందీ ఎన్టీఆర్‌! ఇప్పుడు ఆయన పేరుకే వైసీపీ సర్కారు మంగళం పాడుతోంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎస్‌ పేరు పెట్టేందుకు రాత్రికి రాత్రే చకచకా ఏర్పాట్లు చేసింది.


అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించుకుంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి... ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. మంగళవారం రాత్రి హడావుడిగా ఆన్‌లైన్‌లో మంత్రులకు ఈ సవరణలను పంపి, కేబినెట్‌ అనుమతి కూడా తీసేసుకున్నట్లు తెలిసింది. బుధవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆమోదించగానే... డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్తా, ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా మారుతుంది. 


హెల్త్‌ వర్సిటీ పేరు కథ..

వైద్య విద్యార్థులకు అప్పట్లో ఏపీలో ప్రత్యేక వర్సిటీ లేదు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలే వైద్య విద్యార్థులకు గుర్తింపు ఇచ్చేవి. ఈ క్రమంలో అనేక అక్రమాలు జరిగేవి. తగిన పర్యవేక్షణ ఉండేది కాదు. ఆయా వర్సిటీల పేరుతో నకిలీ ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో... వైద్య విద్యలో నాణ్యత పెంచి, పర్యవేక్షణ, నియంత్రణ సాధించేందుకు ఒక స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థ ఉండాలని ఎన్టీఆర్‌ భావించారు. ప్రత్యేకంగా... హెల్త్‌ వర్సిటీని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. అప్పట్లో అన్ని సంస్థలూ హైదరాబాద్‌ కేంద్రంగానే ఏర్పడి పని చేసేవి. కానీ, తెలంగాణతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికీ చేరువలో ఉండేలా... విజయవాడలో హెల్త్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలని 1983లో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకు... 1986 ఏప్రిల్‌లో వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే ఏడాది నవంబరు 1 నుంచి అడ్మిషన్లు స్వీకరించడం మొదలైంది. అప్పట్లో దీనికి తొలుత పెట్టిన పేరు యునివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌. 1998 ఫిబ్రవరిలో, అంటే ఎన్టీఆర్‌ చనిపోయిన రెండేళ్లకు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఎన్టీఆర్‌ చొరవతో ఏర్పడిన విశ్వవిద్యాలయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం 1998లో యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌సగా ఉన్న పేరును ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌సగా మార్చుతూ వర్సిటీ యాక్ట్‌ను సవరించారు. అనంతరం కొన్ని రోజులకు ప్రస్తుతం అంతా పిలుచుకుంటున్న డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌సగా టీడీపీ ప్రభుత్వం పేరు మార్చింది. 


అందరూ గౌరవించినా...

వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలేవీ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు జోలికి వెళ్లలేదు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపైనే దృష్టి సారించాయి. చివరకు వైఎస్‌ రాజఽశేఖర్‌ రెడ్డి కూడా తన హయాంలో ఎప్పుడూ వర్సిటీ కార్యకలాపాల్లో వేలు పెట్టలేదు. రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత సీఎంలుగా పని చేసిన రోశయ్య, కిరణకుమార్‌ రెడ్డిలు కూడా వర్సిటీ పేరు మార్చాలని అనుకోలేదు. పార్టీలకు అతీతంగా పాతతరం ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అప్పట్లో ఎన్టీఆర్‌కు అంత గౌరవం ఇచ్చారు. వైఎస్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కడప జిల్లాలోని హార్టీకల్చర్‌ యూనివర్సిటీకి డా.వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీగా నామకరణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఈ పేరునే కొనసాగించింది. తాను పాలించిన ఐదేళ్ల కాలంలో ఎన్నడూ వైఎస్‌ పేరు తొలగించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. ఇప్పుడు మాత్రం జగన్‌ సర్కారు ఎన్టీఆర్‌ పేరును తీసేస్తుండటం గమనార్హం. అనేక పథకాలకు పేరు మార్చినట్లే... వర్సిటీ పేరునూ మార్చేస్తున్నారు.


జిల్లాకు పేరుపెట్టి...

జిల్లాల పునర్విభజన సమయంలో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేసింది. ఎన్టీఆర్‌ను టీడీపీ, చంద్రబాబు అలక్ష్యం చేశారని చెప్పింది. ఆయనంటే తమకు ఎంతో గౌరవమున్నట్లు గొప్పలు చెప్పుకొంది. ఒక చిన్న జిల్లాకు ఆయన పేరుపెట్టి... ఇప్పుడు ప్రతిష్ఠాత్మక హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఆయన పేరును దూరం చేస్తోంది.



Updated Date - 2022-09-21T08:09:35+05:30 IST