NTR Fans Raleigh: అంబ‌రాన్నంటి 'ఎన్టీఆర్' శ‌త జ‌యంతి వేడుక

ABN , First Publish Date - 2022-06-01T14:04:52+05:30 IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, కళాప్రపూర్ణ, పద్మశ్రీ, ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు శ‌త జ‌యంతి కార్య‌క్ర‌మం రాలీ, నార్త్ క‌రోలినాలో అంబ‌రాన్నంటేలా సాగింది.

NTR Fans Raleigh: అంబ‌రాన్నంటి 'ఎన్టీఆర్' శ‌త జ‌యంతి వేడుక

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, కళాప్రపూర్ణ, పద్మశ్రీ, ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు శ‌త జ‌యంతి కార్య‌క్ర‌మం రాలీ, నార్త్ క‌రోలినాలో అంబ‌రాన్నంటేలా సాగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల‌కు చెందిన తెలుగు వారు, NTR అభిమానులు, టీడీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ద‌శ దిశ‌లా చాటిన తెలుగు తేజం దివంగ‌త స్వ‌ర్గీయ 'ఎన్టీఆర్‌'. భౌతికంగా ఆయ‌న మ‌న ముందులేక‌పోయినా, ఆయ‌న వేసిన బాట‌, చూపిన దారి చిర‌స్థాయిగా నిలిచిపోయింది. తెలుగు వాడి, వేడిని దేశానికి చాటిన ఆయ‌న తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని జీవించాల‌ని అభిల‌షించారు. అందుకే ఆయ‌న అంద‌రికీ ఆద‌ర్శ మూర్తి అయ్యారు. మే 28 నాటికి అన్న‌గారు ఎన్టీఆర్ జ‌న్మించి 99 సంవ‌త్సరాలు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది మే 28 వ‌ర‌కు శ‌త‌జ‌యంతి నిర్వ‌హించాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ఎన్నారై తెలుగు వారు కూడా అన్న‌గారి శ‌త జ‌యంతిని ఘ‌నంగి నిర్వ‌హించుకుంటున్నారు. 


అమెరికాలోని రాలీ, నార్త్ క‌రోలినాలో అన్న‌గారి అభిమానులు, టీడీపీ నాయ‌కులు శ‌త‌జయంతి వేడుక‌ను నిర్వ‌హించారు. తొలుత జై ఎన్టీఆర్‌, జై జై ఎన్టీఆర్ అనే జ‌య జ‌య ధ్వానాల మ‌ధ్య అన్న‌గారి కాంస్య విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. అనంత‌రం త‌ర‌లి వ‌చ్చిన అభిమానులు అన్న‌గారి ప‌పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సుమారు వెయ్యి మంది వ‌ర‌కు పాల్గొన్నారు. అదేవిధంగా NRI టీడీపీ USA కన్వీనర్ జయరాం కోమటి, పశ్చిమగోదావరి జిల్లా నుంచి MLC మంతెన వెంకట సత్యనారాయణ రాజు, యాక్టర్, డాన్సర్ L విజయ లక్ష్మి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ YVS చౌదరి, నిరంజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్న‌గారి కీర్తిని ప్ర‌శంసించారు. ఆయ‌న చూపిన దారిలో న‌డ‌వాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 


ఎన్టీఆర్ న‌టించిన సినిమాల్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ సాంగ్స్‌ను, దుర్యోధ‌నాది పాత్ర‌ల‌ను న‌టించి అంద‌రికి క‌నుల విందు చేశారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అతిథుల‌కు 30కిపైగా అన్న‌గారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన కూర‌లు, ఊర‌గాయ‌లు, మిఠాయిలుతో ష‌డ్ర‌సోపేత‌మైన విందును అందించారు.  ఈ కార్య‌క్ర‌మ నిర్వాహ‌క క‌మిటీకి, శ్రీనివాస్ ఆరెమండ నేతృత్వం వ‌హించారు. స‌భ్యులు ధ‌వి మార్తాల‌, పూర్ణ కండ్ర‌గుంట‌, మోహ‌న్ కోడె, హ‌రి నాదెండ్ల‌, క్రిష్టారెడ్డి, శ్రీనివాస్ అనంత‌, నాగ‌రాజు, ర‌వి కిశోర్‌, శిరీష్ గొట్టిముక్క‌ల, శ్రీధర్ గొట్టిపాటి, శ్రీనివాస్ మార్తాల కార్య‌క్ర‌మాన్ని ముందుండి న‌డిపించారు. గ‌డిచిన 20 ఏళ్లుగా ఈ కార్య‌క్ర‌మానికి స‌పోర్టు చేస్తున్న వారు ఈ కార్య‌క్ర‌మాన్ని బ్ర‌హ్మాండంగా ముందుకు న‌డిపించారు.

Updated Date - 2022-06-01T14:04:52+05:30 IST