Sep 17 2021 @ 17:05PM

NTR: ఈ లొకేషన్‌ నాది.. ఇక్కడ నేనే బాస్‌!


దర్శకులు రాజమౌళి, కొరటాల శివ ఎన్టీఆర్‌కు క్లాప్‌, రోల్‌ కెమెరా, యాక్షన్‌,  కట్‌ చెప్పడం చూశాం. మరి ఎన్టీఆర్‌ ఈ దర్శకులిద్దరినీ డైరెక్ట్‌ చేస్తే ఎలా ఉంటుంది? కనుల పండుగే కదూ! ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న  ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఆ అవకాశాన్ని ప్రేక్షకులకు కలిగించింది. ఈ నెల 20న ప్రసారం కానున్న షోకు రాజమౌళి, కొరటాల శివ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. తాజాగా ఆ ప్రోమో విడుదలై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 


‘రోల్‌ కెమెరా’ అని శివ.. ‘యాక్షన్‌’ అని రాజమౌళి మైక్‌ చేతపట్టి హాట్‌ సీట్‌లో కూర్చొని సందడి చేశారు. తారక్‌ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం కోసం రాజమౌళి, శివ ఒకరి చెవులు ఒకరు కొరుకున్నారు. ‘మీలో మీరు మాట్లాడుకుంటే మాకేం వినిపిస్తుంది. ఇలా చేసినందుకు వీరికి ఆప్షన్లు  లేకుండా ఈ ప్రశ్నని తొలగించవచ్చా గురువు (కంప్యూటర్‌) గారు’ అని ఎన్టీఆర్‌ అనగానే ‘తప్పండి.. అలా చేయకూడదు’ అంటూ హాట్‌ సీట్‌లో ఉన్న దర్శకులిద్దరూ తారక్‌ను కోరతారు. వారికి ఎన్టీఆర్‌ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ‘ఇక్కడ లొకేషన్‌ నాది, డైరెక్షన్‌ నాది.. నేనే బాస్‌ ఇక్కడ’ అని తారక్‌ చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి.