ఏడాదిపాటు ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు !

ABN , First Publish Date - 2022-05-29T09:26:30+05:30 IST

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి శనివారం రాష్ట్రంలో ఘనంగా జరిగింది.

ఏడాదిపాటు ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు !

  • తెలుగు రాష్ట్రాల్లోని 12 కేంద్రాల్లో నిర్వహణ
  • రూ.100 నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ కోసం ఆర్‌బీఐతో చర్చిస్తున్నాం : పురంధేశ్వరి
  • కుటుంబ సభ్యులు, ప్రముఖుల నివాళి


హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి శనివారం రాష్ట్రంలో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. సినీ నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు తెల్లవారుజామున 5 గంటలకు ఘాట్‌ వద్దకు వచ్చి ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. కేంద్ర మాజీ మంతి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు, ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ, కుటుంబ సభ్యులు నందమూరి సుహాసిని, మనువలు, మనవరాళ్లు తదితర కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి నివాళులర్పించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఈ నెల 28 నుంచి 2023 మే 28 వరకు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏపీలోని తిరుపతి, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ తదితర 12 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు చెప్పా రు.  


వివిధ రంగాల్లో నిష్ణాతులైన, విశేష సేవలందించిన వారిని సత్కరించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వేసిన కమిటీలో నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ, పారిశ్రామికవేత్తలు రాజేంద్రప్రసాద్‌, మహాలక్ష్మి హరిశ్చంద్రప్రసాద్‌, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, రైతు నేస్తం వెంకటేశ్వర్‌రావు, సీనియర్‌ పాత్రికేయులు రామారావు, కృష్ణారావు, రాజా హుస్సేన్‌ ఉన్నారని చెప్పారు. రూ.100 నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రించేలా ఆర్‌బీఐతో జరుపుతున్న చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. నిజాంపేట ప్రగతినగర్‌ కమాన్‌ వద్ద ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పురంధేశ్వరి ఆవిష్కరించారు. అలాగే, ఫిలింనగర్‌ చౌరస్తాలో శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ ప్రతిమను పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు మాగంటి, దానం ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ఓయూలో నిర్వహించిన ఎన్టీఆర్‌ జయంత్యుత్సవాల్లో ఓయూ లా కాలేజీ డీన్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌, ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వరరావులు డిమాండ్‌  చేశారు. 


అందరూ కలిసి.. అన్న గారి స్మరణకు..

శనివారం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మంత్రులు పువ్వాడ, మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, కేపీ వివేక్‌, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఏపీ మాజీమంత్రి పరిటాల సునీత పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని, ఇందుకోసం పార్లమెంటులో పోరాడతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ సాయన్న, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హన్మంతరావు ఘాట్‌ వద్దకు రాలేదు. అయితే, సాయం త్రం ఎన్టీఆర్‌ను కొనియాడుతూ తలసాని పేరిట ప్రకటన వెలువడింది. నిజామాబాద్‌ జిల్లా ధర్మారంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ కంటే తెలంగాణ ప్రాంత అభ్యున్నతికి ఎన్టీఆర్‌ ఎనలేని కృషి చేశారని అన్నారు. పేదలకోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-29T09:26:30+05:30 IST