ఏడాదిపాటు ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు !

ABN , First Publish Date - 2022-05-29T08:38:22+05:30 IST

ఏడాదిపాటు ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు !

ఏడాదిపాటు ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు !

తెలుగు రాష్ట్రాల్లోని 12 కేంద్రాల్లో నిర్వహణ

మహానీయుడికి కుటుంబ సభ్యులు, టీ మంత్రుల నివాళులు

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, మే 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయం తి శనివారం తెలంగాణలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. సినీ నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు తెల్లవారుజామున 5 గంటలకు ఘాట్‌ వద్దకు వచ్చి ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. కేంద్ర మాజీ మంతి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు, ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ, కుటుంబ సభ్యులు నందమూరి సుహాసిని, మనువలు, మనవరాళ్లు తదితర కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి నివాళులర్పించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఈ నెల 28 నుంచి 2023 మే 28 వరకు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ ఉత్సవాలను ఏపీలోని తిరుపతి, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ తదితర 12 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. రూ.100 నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రించేలా ఆర్‌బీఐతో జరుపుతున్న చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. నిజాంపేట ప్రగతినగర్‌ కమాన్‌ వద్ద ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పురంధేశ్వరి ఆవిష్కరించారు.   


అందరూ కలిసి.. అన్న గారి స్మరణకు..

శనివారం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద అరుదైన దృశ్యం కనిపించింది. మంత్రులు పువ్వాడ అజయ్‌, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, కేపీ వివేక్‌, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌ గౌడ్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, ఇందుకోసం తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్లమెంటులో పోరాడతారని మంత్రి మల్లారెడ్డి అన్నారు.


Updated Date - 2022-05-29T08:38:22+05:30 IST