Oct 28 2021 @ 12:05PM

తారక్, భన్సాలి మూవీకి ఆసక్తికరమైన టైటిల్

యంగ్ టైగర్ యన్టీఆర్ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, దాన్ని కళాత్మక దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్నారన్న వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్ళాలనేంతగా ఆ సినిమా నేపథ్యం, కథాంశం తారక్ కు బాగా నచ్చేశాయట. ఈ సినిమాను ‘భాజీరావు మస్తానీ, పద్మావత్’ సినిమాల రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. పౌరాణిక నేపథ్యంలో సాగే ఓ చారిత్రాత్మక చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తారట. అయితే ఈ సినిమాకి ‘జై భవ్ రే’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖాయం చేయబోతున్నారట. ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని టాక్. 



యన్టీఆర్  డెబ్యూ మూవీ ‘రామాయణం’ పౌరాణిక చిత్రమైనప్పటికీ.. అందులో ఆయన బాలనటుడు మాత్రమే. దాని తర్వాత మరెలాంటి పౌరాణిక చిత్రంలోనూ నటించలేదు. కానీ యమదొంగలో కాసేపు ‘యముడి’ గా సమాస భూయిష్టమైన సంభాషణలు పలికి అభిమానుల్ని అలరించారు. అందుకే ఇప్పుడీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కళాత్మక చిత్రాలు తీయడంలో చెయితిరిగిన భన్సాలీ, పౌరాణిక చిత్రాలకు ప్రాణం పోసే టాలెంటున్న యన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న ఈ మూవీ ఏ కథాంశంతో తెరకెక్కబోతోందో కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతోంది. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ కు ‘జై భవ్ రే’ అనే టైటిల్ ఖాయం చేస్తారో లేదో చూడాలి.