Apr 12 2021 @ 19:31PM

అఫీషియల్‌: ‘ఎన్టీఆర్‌ 30’ చిత్ర దర్శకుడు కొరటాల శివ

'ఆర్‌ఆర్ఆర్‌' చిత్రం తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. మాటల మాంత్రికుడు, సంచలన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లలో తన 30వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం అనూహ్యంగా ఆగిపోయింది. ఎన్టీఆర్‌ 30వ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాదు. యంగ్‌ టైగర్‌తో 'జనతా గ్యారేజ్‌' వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివతో ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సోమవారం(ఏప్రిల్‌ 12) సాయంత్రం మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై నందమూరి కల్యాణ్‌ రామ్‌, కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం జూన్‌ సెకండాఫ్‌లో ప్రారంభం కానుంది. అలాగే విడుదల తేదీని కూడా మేకర్స్‌ ప్రకటించారు. వచ్చే సంవత్సరం (2022) ఏప్రిల్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్ర ప్రకటనకు సంబంధించి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్‌ వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.