ప్రజా సంపద ఫలహారం!

ABN , First Publish Date - 2022-05-23T05:33:54+05:30 IST

ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రూ.కోట్ల విలువైన సంపదను కొల్లగొడుతున్నారు.

ప్రజా సంపద ఫలహారం!
ఎక్స్‌కవేటర్‌తో చెట్లను తొలగిస్తున్న దృశ్యం (పాత చిత్రం)

రూ.4కోట్ల ఎన్‌ఎస్‌పీ సంపద హాంఫట్‌  

అటవీశాఖ అనుమతులు లేకుండా భారీ వృక్షాలు తొలగింపు 

కలప, మట్టి, కొండరాళ్లు, ఇనుము అమ్ముకున్న వైనం 

ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని కాజేసేందుకు కొందరి కన్ను!

38 ఏళ్ల లీజుకు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు


వినుకొండ, మే 22: ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రూ.కోట్ల విలువైన సంపదను కొల్లగొడుతున్నారు. అధికారం ఉంటే ఎంతటి అక్రమాలైనా అవలీలగా చేయవచ్చని నిరూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే ఎన్‌ఎస్‌పీ కాలనీ స్థలం ఉంది. గతంలో ఇది సుమారు 200క్వార్టర్స్‌, భారీ వృక్షాలు, పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండేది. పట్టణ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నాటి టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ భూమిని మున్సిపాలిటీకి అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి అనుమతులు సాధించారు. ఈ భూమిలో కల్యాణమండపం, కూరగాయల మార్కెట్‌, స్టేడియం, పార్కు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ స్థలాన్ని అభివృద్ధి పేరుతో క్వార్టర్లను పడగొట్టించి అక్కడి వారిని ఖాళీ చేయించి చదును చేసింది.


వృక్షాలు, కలప, మట్టి.. అక్రమంగా తరలింపు

ఎన్‌ఎస్‌పీ స్థలం చదును చేయించే క్రమంలో ఇక్కడ ఉన్న వృక్షాలను కూల్చివేశారు. చెట్లను తొలగించాలంటే తప్పనిసరిగా అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే ఈ కాలనీలో వందలాది చెట్లను అటవీశాఖ అధికారుల అనుమతి పొందకుండానే మున్సిపల్‌ అధికారులు  వారి ఇష్టానుసారంగా తొలగింపజేశారు. వాటి ద్వారా వచ్చిన. కలపను అప్పనంగా విక్రయించారు. ఇక్కడి చెట్లను తొలగించేందుకు తమ వద్ద ఎవరూ ఎటువంటి అనుమతులు తీసుకోలేదని అటవీశాఖ క్షేత్రాధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఈ ఏడాది మార్చి 19వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఈ క్వార్టర్స్‌  కూల్చివేయగా వచ్చిన రాళ్లు, కొండరాయి, టేకు కలప, మట్టి, వేల టన్నుల ఇనుము ఎన్‌ఎస్‌పీకి చెందిన వివిధ రకాల వస్తువులు అక్రమంగా తరలించి సొంతానికి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రక్కు మట్టి రూ.700కు పైగా నిర్ణయించి.. వేల ట్రక్కులు అక్రమంగా తరలించినట్లు సమాచారం. అలాగే కొండరాళ్లు, క్వార్టర్స్‌ నుంచి వచ్చిన సైజురాళ్లు ఒక్కొక్క రాయి రూ.7 చొప్పున అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు టన్నుల కొద్ది టేకు, కలప, భారీ వృక్షాలను కూడా విక్రయించారు. మొత్తం మీద సుమారు రూ.4కోట్లు విలువ చేస్తుందని ఆయా శాఖల్లో విధులు నిర్వహించే ఇంజనీరింగ్‌ అధికారుల అంచనా.  అనుమతులు, బహిరంగ వేలం లేకుండా కోట్ల రూపాయల విలువ చేసే ఎన్‌ఎస్‌పీ సంపదను అధికార పార్టీ వర్గీయులు, మున్సిపల్‌ అధికారులు అనధికారికంగా దోచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


 అగ్ర నేతల కన్ను..!

ఇదిలా ఉండగా వందల కోట్ల విలువ చేసే ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ అగ్రనేతల కన్ను పడినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే సుమారు వెయ్యి షాపులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడతానని చెప్పినప్పటికీ ప్రభుత్వ నిధుల కేటాయింపు లేదు. దీంతో మున్సిపల్‌ నిబంధనలను అతిక్రమించి వ్యాపారులకు  విలువైన షాపులను అప్పగిస్తామని వారి నుంచి భారీగా గుడ్‌విల్‌ సొమ్మును వసూళ్లు చేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌ చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ స్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ అగ్రనేతలు ఇప్పటికే దృష్టిసారించి 38 సంవత్సరాలు లీజు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వినుకొండ ప్రజలకు సదుపాయాలు కల్పించే విధంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ హయాంలో తాము ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించామని, దానిని ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అధికార పార్టీకి చెందిన అగ్రనేతలు 38 సంవత్సరాలు లీజు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. రూ.కోట్ల విలువ చేసే ఎన్‌ఎస్‌పీ స్థలంలో చిరువ్యాపారులకు, వ్యాపార సంస్థల వారికి అవకాశం కల్పించి ప్రజా ప్రయోజనాలకు అభివృద్ధి చేయాల్సి ఉండగా పాలకులు, అధికారులు కుమ్మక్కై ఎన్‌ఎస్‌పీ సంపదను దోచుకోవడం, వందల కోట్లు విలువ చేసే స్థలాన్ని బడా నేతలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 


టెండర్లు పిలిచి క్వార్టర్స్‌ను తొలగించాం...

హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించడం జరిగింది. న్‌ఎస్‌పీ శాఖ వారు క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరాయని, ఇవి మాకు పనికిరావని చెప్పారు. దీంతో రూ.పదిలక్షలతో టెండర్లు పిలిచి శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్‌ను కాంట్రాక్టర్‌ ద్వారా తొలగించాం.

- శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌

 

Updated Date - 2022-05-23T05:33:54+05:30 IST