చినుకు చింత

ABN , First Publish Date - 2021-06-20T05:24:31+05:30 IST

గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవటం, ప్రాజెక్టులు నిండటంతో వరి, పత్తి, మిరప తదితర పంటలను విస్తృతంగా రైతులు సాగు చేశారు.

చినుకు చింత
పొలం దుక్కి దున్నకం

మొఖం చాటేసిన తొలకరి

సందిగ్ధంలో పంటల సాగు 

43 మండలాల్లో వర్షాభావం 


 పవనాలు వచ్చేశాయి.. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు పడతాయి.. అని     ఈ నెల ఆరంభంలో వాతావరణ శాఖ తీపి కబురుతో సాగుకు సిద్ధమైన రైతులు.. చినుకు కోసం చింత పడుతు న్నారు. జూన్‌ నెల మూడో వారంలోకి అడుగుపెడుతున్నా.. చినుకు జాడ లేదు. తొలకరి మొఖం చాటేయడంతో పంటల సాగు సందిగ్ధంలో పడింది. జిల్లాలో 43 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటుతు న్నాయి. ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా ఎక్కువుగా నమోదవుతున్నది. వర్షాలు కురవక పోవటంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. దీంతో వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 



31.1 శాతం లోటు

జిల్లాలో ఇప్పటికి 58.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అయితే 40.5 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. 31.1 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 22 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 21 మండలాల్లో వర్షభావ పరిస్థితులు నెలకున్నాయి. 14 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. నకరికల్లు, ముప్పాళ్ళ, ఫిరంగిపురం, మేడికొండూరు, ప్రత్తిపాడు, యడ్లపాడు, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, ఈపూరు, శావల్యాపురం, వినుకొండ, చిలకలూరిపేట, పెదనందిపాడు, పొన్నూరు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలాలలో తీవ్ర వర్షాభావం నెలకొంది.  



నరసరావుపేట, జూన్‌ 19: గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవటం, ప్రాజెక్టులు నిండటంతో వరి, పత్తి, మిరప తదితర పంటలను విస్తృతంగా రైతులు సాగు చేశారు. గత ఏడాది వర్షాకాలం ఆరంభంలోనే సకాలంలో వర్షాలు కురిశాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా అక్కడక్కడ చిరు జల్లులు తప్ప పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు కురవలేదు. జిల్లాలో పంటల సాగు సాఽధారణ విస్తీర్ణం 12.03 లక్షల ఎకరాలు. అత్యధిక శాతం వరి, పత్తి, మిరప సాగు చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ మూడు ప్రధాన పంటల  సాగుకు వాతావరణం అనుకూలించటం లేదు. చినుకు రాలక పోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కూడా వర్షాభావం నెలకొంది. గత ఏడాది ఈ నెలలో భారీ వర్షాలు కురవడంతో పంటలను రైతులు సాగు చేశారు. మెట్ట పైర్లు వేసే పొలాలను రైతులు దుక్కులుదున్నారు. వరి సాగు చేసే పొలాల్లో దుక్కులు దున్నేందుకు రైతులు సాహసం చేయడం లేదు. మొత్తం మీద పంటల సాగుకు గడ్డు కాలం నెలకుంది.


నిండుకుంటున్న నిల్వలు

ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర జలాశయాల్లో నీటి నిల్వలు నిండుకున్నాయి. ఈ జలాశయంలో 85 టీఎంసీల నీటి నిల్వ చేరితేనే ఆల్మట్టి నుంచి దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి ఉంటుంది. శ్రీశైలం జలాశయం ఎగువున ఉన్న డ్యామ్‌లలో నీటి నిల్వలు పడి పోయాయి. శ్రీశైలం ఎగువున ఉన్న అన్ని జలాశయాలు నిండి దిగువకు నీరు విడుదల కావాలంటే సుమారు 195 టీఎంసీల నీటి నిల్వలు ఆయా జలాశయాలకు చేరుకోవాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం నిండితేనే నాగార్జున సాగర్‌కు నీరు విడులవుతుంది. రానున్న రెండు నెలల్లో ఈ పరిస్థితులు వస్తాయా? లేదా? అన్న ఆందోళన సర్వత్రా నెలకుంది. వరుణుడు కరుణించి జలాశయాలు నిండాలని, సాగునీరు విడుదల కావాలని రైతులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2021-06-20T05:24:31+05:30 IST