Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెల్ల బియ్యం.. నల్లబజారుకు..

  నరసరావుపేట కేంద్రంగా పేదల బియ్యం బ్లాక్‌ మార్కెట్‌

1090.50 క్వింటాళ్ళ బియ్యం నిల్వలు స్వాధీనం

విలువ రూ.41 లక్షలని తేల్చిన అధికారులు

రేషన్‌ మాఫియా సూత్రధారులు అధికార పార్టీ వ్యక్తులే?

రీ సైక్లింగ్‌ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న వైనం

నలుగురిపై కేసులు నమోదు


నరసరావుపేట, అక్టోబరు 21: నరసరావుపేట కేంద్రంగా పేదల బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖలు గురువారం నిర్వహించిన తనిఖీల్లో రేషన్‌ మాఫియా గుట్టు రట్టయింది. జిల్లా పౌరసరఫరాల ఉన్నతాధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా రావిపాడు రోడ్డులోని స్వప్న ట్రేడర్స్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబరు నెలలో నాలుగు వేల బస్తాల బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నాటి అక్రమార్కులే మళ్లీ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ నిర్వహిస్తున్నట్టు అధికారుల తనీఖీలలో వెల్లడైంది. అధికార పార్టీ చెందిన ముఖ్య వ్యక్తులే బ్లాక్‌ మార్కెట్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

 నరసరావుపేట రావిపాడు రోడ్డులో స్వప్న ట్రేడర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న రైస్‌ మిల్లులో నిర్వహించిన తనిఖీల్లో 1090.50 క్వింటాళ్ళ బియ్యం నిల్వలను అధికారులు స్వాఽధీన పరచుకున్నారు. ఈ నిల్వల విలువ మార్కెట్‌ ధర ప్రకారం రూ.41 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇంత పెద్దఎత్తున ఒకే చోట పేదల బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ చేస్తూ పట్టుపడటం నరసరావుపేటలో ఇది రెండోసారి.  ప్రభుత్వ స్టాక్‌ పాయింట్‌ నుంచి నేరుగా ఈ మిల్లుకు బియ్యం సరఫరా అయినట్టు ప్రాథమిక సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేరుతో ముద్రించిన గోతాలలోనే ఉన్న బియ్యం నిల్వలను గుర్తించారు. ఒక లారీ లోడు 450 బస్తాలు మిల్లులో దిగుమతి చేస్తుండగా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. బియ్యం లోడుతో మిల్లు ఉన్న లారీని కూడా సీజ్‌ చేశారు. బియ్యం నిల్వలను రెవెన్యూ, పౌర సరఫరా శాఖల అధికారులు స్వాధీన పరచుకున్నారు. స్వప్న ట్రేడర్స్‌ నిర్వాహకులు ఆవుల శివారెడ్డి, బత్తుల బాలయ్య, లారీడ్రైవర్‌ వి.భూపాల్‌, బి.కిషోర్‌బాబులపై కేసులు నమోదు చేసినట్టు తహసీల్దార్‌ రమణ నాయక్‌ తెలిపారు. తనిఖీలలో తహసీల్డార్‌ రమణనాయక్‌, ఎస్‌వో భాషా, డీటీలు కొండారెడ్డి, ఆర్‌ఐ కిర ణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రీ సైక్లింగ్‌ ఇలా...

డీలర్ల నుంచి బియ్యం సేకరించి మిల్లు తరలిస్తారు. ఒక పట్టు పాలిష్‌ వేసి గోతాలు మారుస్తారు. 50 కేజీల బ్యాగ్‌లో ప్యాకింగ్‌ చేస్తారు. ఇలా రీ సైక్లింగ్‌ చేసిన బియ్యం నిల్వలను జిల్లా సరిహద్దులు దాటిస్తారు. ఎక్కువుగా కాకినాడ పోర్టుకు తరలిస్తారని, అక్కడినుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు సమాచారం. ఇందులో పలువురు వ్యాపారులు పాలుపంచుకుంటారు. 

అధికారులపై రాజకీయ వత్తిడిలు

 బియ్యం రీ సైక్టింగ్‌ చేస్తున్నట్టు చిరునామాలతో సహా సమాచారం ఉన్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. వీరిపై రాజకీయ వత్తిడిలు ఉండటం, బ్లాక్‌ మార్కెట్‌ చేస్తోంది అధికార పార్టీ వ్యక్తులు కావడంతో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. వినుకొండ రోడ్డులోని ఒక మిల్లు కేంద్రంగా బియ్యం రీ సైక్లింగ్‌ జరుగుతోంది. వీరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులే అని ప్రచారం జరుగుతోంది. ఈ కేంద్రంలో కూడా రేషన్‌ నిల్వలు అధికంగానే ఉన్నట్టు సమాచారం.

ఈ సారైనా చర్యలు తీసుకుంటారా ?

 క్రితంసారి ఇదే మిల్లులో వేలాది బస్తాల బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకున్న కేసును నీరు గార్చారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు నామామాత్రంగా కేసులు నమోదు చేయడం వలనే అక్రమార్కులు మళ్ళీ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించారు. అధికార పార్టీలో మరికొందరు వ్యక్తులు కూడా బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ముఠాల మధ్య ఏర్పడిన వివాదాల కారణంగా ఒక వర్గం ఫిర్యాదుతో అధికారులు బియ్యం నిల్వలను స్వాధీన పరచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సారైనా బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించే దిశ సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేక గతంలో వలే కేసు నీరు గారుస్తారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement