హాస్టళ్లలో.. అర్ధాకలి!

ABN , First Publish Date - 2022-07-31T05:41:06+05:30 IST

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. భోజన పట్టికను ఘనంగా ప్రకటించిన పాలకులు దానికి సరిపడా నిధులు ఇవ్వడం లేదు.

హాస్టళ్లలో..  అర్ధాకలి!
ఎస్సీ బాలుర వసతి గృహం

ఐదేళ్ల కిందటి ధరలే నేడూ..

 భోజన పట్టికను అమలు చేయలేని స్థితిలో నిర్వాహకులు

2018 నాటి సరుకుల ధరలే నేటికీ అమలు

సరుకుల ధరలు రెట్టింపు

కిలో కందిపప్పుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.52

మార్కెట్‌లో కిలో ధర రూ.110

 

 రోజు రోజుకు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఈ స్థాయిలో ప్రభుత్వం వసతి గృహాలకు బడ్జెట్‌ పెంచడంలేదు.  భోజనానికి సంబంధించి సరుకుల ధరలు మార్కెట్‌ కనుగుణంగా పెంచకుండా ఐదేళ్ల క్రితం నాటి రేట్లే చెల్లిస్తూ ప్రభుత్వం విద్యార్థుల కడుపు కాల్చుతోంది. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచాలని పదే పదే ప్రభుత్వానికి వసతి గృహాల నిర్వహణ అధికారులు ఇస్తున ప్రతిపాదనలు బుట్టదాఖలు అవుతున్నాయి. దీంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో భోజన పట్టికను అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

 

నరసరావుపేట, జూలై 30: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. భోజన పట్టికను ఘనంగా ప్రకటించిన పాలకులు దానికి సరిపడా నిధులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో నిర్ధేశించిన భోజన పట్టికను అములు చేయలేక నిర్వహణ  అధికారులు చేతుతెత్తేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నానని చెబుతున్న ప్రభుత్వం దానిని ఆచరణలో చూపడం లేదు.  2018 నాటి సరుకుల ధరలనే నేటికి వసతి గృహాల్లో విద్యార్థులకు చెల్లిస్తోంది. ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వం నాటి ధరలనే చెల్లిస్తుండటంతో నిర్వహకులు విద్యార్థుల ఆకలిని తీర్చలేకపోతున్నారు.


నిధులు చాలక మెనూలో కోత..

గ్యాస్‌ సిలెండర్‌ ధరను ప్రభుత్వం రూ.781గా నిర్ణయించింది. మార్కెట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1.094 ఉంది. ఈ రేటు కూడా ప్రభుత్వంకు తెలియక పోవడం దారుణం అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కందిపప్పు కిలో రూ.52 ఈ రేటుకు దేశంలో ఎక్కడైనా కింది పప్పు లభిస్తుందా? అనేది ప్రభుత్వంకే తెలియాలి. రోజు రోజుకు నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయి. ఈ స్థాయిలో ప్రభుత్వం వసతి గృహాలకు బడ్జెట్‌ పెంచడంలేదు. వసతి గృహాల నిర్వహణ అధికారులు ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోక మెనులో కోత విధిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం మెను అమలు చేయాలంటే సదరు అధికారి జీతం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచాలని పదేపదే ప్రభుత్వానికి వసతి గృహాల నిర్వహణ అధికారులు ఇస్తున ప్రతిపాదనలు బుట్టదాఖలు అవుతున్నాయి. ఽనిత్యావసరాల ధరలకు అనుగుణంగానే ఉద్యోగుల పీఆర్‌సీని పెంచింది. ఈ విధానాన్ని వసతి గృహాలకు అమలు చేయకపోవడం వీటి నిర్వహణపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. 


లెక్క ప్రకారం అందని మెనూ..

ఉప్పు, పప్పులు, కూరగాయలు నూనె, గ్యాస్‌ ఒకటేమిటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల వసతి గృహాలలో 15 వేలకు పైగా విద్యార్థులు ఉంటున్నారు. కళాశాలల విద్యార్ధులకు నెలకు రూ.1400, స్కూల్స్‌ విద్యార్థులకు నెలకు రూ.1,250 భోజనం కోసం ప్రభుత్వం చెల్లిస్తోంది. కళాశాలల విద్యార్థులకు రోజు వసతి గృహాంలో ఉదయం టిఫిన్‌, రెండు పూటల భోజనం అందించాలి. స్కూల్స్‌ విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, ఒక పూట భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అందించాలి. స్కూల్స్‌ సెలవు రోజుల్లో రెండు పూటలా భోజనం వడ్డించాలి. కళాశాలల విద్యార్థులకు రోజుకు రూ.46.66కు రెండు పూటలా భోజనం, ఉదయం టిఫిన్‌ పెట్టాలి. మార్కెట్‌లో ధరలను పరిశీలిస్తే ఈ ధరకు భోజనం అందించలేని పరిస్థితి. ఉదయం అల్పాహరం రోజుకో రకం వేరుశనగ చట్నీతో, సాయత్రం బెల్లంతో రాగి జావ, చిక్కీలు, రాత్రి భోజనం, అరటి పండు, వారంలో మూడు రోజుల చికెన్‌, రోజు ఉదయం ఉడికించిన గుడ్డు, పాలుఅందించాలి. ఈ మెనూ ప్రకటించిన ప్రభుత్వం ధరలను పెంచడాన్ని విస్మరించింది. చికెన్‌, కోడి గుడ్డు మెనూ ప్రకారం ఇవ్వడంలేదు. చికెన్‌ వారానికి ఒక రోజు, గుడ్డు వారానికి మూడు ఇస్తూ సరిపెట్టేస్తున్నారు. మెను ప్రకారం ఇవ్వాలంటే తమ జీతాలు కూడా సరిపోవని కొందరు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం వసతి గృహాల్లో భోజనానికి సంబంధించి సరుకుల ధరలు మార్కెట్‌ కనుగుణంగా పెంచకుండా ఐదేళ్ల క్రితం నాటి రేట్లే చెల్లిస్తూ విద్యార్థుల కడుపు కాల్చుతోంది. ధరల పరిస్థితి ఇలా ఉంటే భోజన బిల్లుల చెల్లింపులోనూ జాప్యం జరుగుతోంది. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సరుకుల ధరలు పెంచాలని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో భోజన పట్టికను అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  


Updated Date - 2022-07-31T05:41:06+05:30 IST