పటమట ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు
ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలకు జిల్లా ముస్తాబు
మహానాయకుడి స్వగ్రామం నిమ్మకూరులో నేడు ‘శక పురుషుడి శతజయంతి’
తరలివచ్చిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు
ఒంగోలులోని మహానాడుకు తరలిన జిల్లాల నాయకులు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఆ రూపం.. అచ్చతెలుగు ప్రతిరూపం. ఆ మాట.. వేయి రతనాల మూట. ఆ నడక.. పౌరుషానికి ప్రతీక. మన ‘కృష్ణా’లో పుట్టి.. ప్రపంచ ఖ్యాతిని చాటి.. తెలుగు సినీ వినీలాకాశంలో ప్రభంజనం సృష్టించి.. రాజకీయ రణక్షేత్రంలో రారాజుగా వెలిగిన అన్న ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలకు జిల్లా ముస్తాబైంది. ‘శక పురుషుడి శతజయంతి’ పేరిట ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో శనివారం జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తికాగా, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తరలివచ్చారు. అటు ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో రెండు జిల్లాల నేతలు పాల్గొని తారకరాముడికి ఘన నివాళులర్పించారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ అనూరాధ, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా పాల్గొన్నారు.
నిమ్మకూరులో జరిగే కార్యక్రమానికి ఏర్పాటుచేస్తున్న బ్యానర్
ఒంగోలులో జరిగిన మహానాడులో లోకేశ్‌తో కరచాలనం చేస్తున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు
పాల్గొన్న దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులు