పావలా వడ్డీ.. పాయె!

ABN , First Publish Date - 2021-10-28T05:58:38+05:30 IST

పావలా వడ్డీ పథకానికి పాలకులు నీళ్లొదిలారు.

పావలా వడ్డీ..  పాయె!

 పంట రుణాలపై వడ్డీ రాయితీకి నీళ్లొదిలిన ప్రభుత్వం

రెండేళ్లుగా అమలు కాని వైనం

రూ.లక్ష కంటే రుణం ఎక్కువ ఉంటే 7శాతం వడ్డీ

భరోసా కింది ఇస్తూనే మరోవైపు లాగేసుకుంటూ..

జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 5,98,974 

వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని వేడుకోలు 

 

నకరికల్లుకు చెందిన రామయ్య రెండెకరాల్లో మిరప సాగు చేశాడు. ఇందుకోసం బ్యాంకు నుంచి రూ.2 లక్షలు పంట రుణం తీసుకున్నాడు. రెండేళ్ల కిందట ఈ మొత్తానికి రూ.4వేలు వడ్డీ చెల్లించేవాడు. ఇప్పుడు వడ్డీ రాయితీ పథకం అమలు కాకపోవడంతో అదే రైతు దాదాపు రూ.14 వేల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఇది రామయ్య ఒక్కడి సమస్య కాదు.. జిల్లాలో రుణాలు తీసుకున్న దాదాపు 5,98,974 మంది సమస్య ఇది. అప్పట్లో రూ.లక్ష దాటిన రూ.3 లక్షలలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ అమల్లో ఉంది. రైతు మూడు శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతం, కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీ పథకానికి చెల్లించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో.. రైతు భరోసా కింది నగదు ఇస్తూనే మరోవైపు ప్రభుత్వం లాగేసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. 


నరసరావుపేట, అక్టోబరు 27: పావలా వడ్డీ పథకానికి పాలకులు నీళ్లొదిలారు. ఎన్నో ఏళ్లుగా అమలులో ఉన్న పంట రుణాలపై వడ్డీ రాయతీ పథకాన్ని అటకెక్కించారు. సాగుకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు పెంచి రైతుల నడ్డి విరిచేశారు. రెండేళ్లుగా వడ్డీ రాయితీ పథకం అమలు కావడంలేదు. దీంతో లక్షలాది మంది రైతులపై ఆర్థిక భారం పడుతోంది. రూ.లక్ష రుణానికి ఒక్క రూపాయి పెరిగినా రైతు 7 శాతం వడ్డీ చెల్లించాల్సిందే. రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్‌ పథకం కింద రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రైతుల రుణాలకు చెల్లించే వడ్డీ మాటున లాగేసుకుంటున్నారు. బ్యాంకుల్లో వడ్డీ రాయితీ అమలు అవుతుందని రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ పెరిగిపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.      


రైతులకు రుణ భారం

  జిల్లాలో 5,98,974 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నట్టు అంచనాగా ఉంది. సున్నా వడ్డీ పథకం కింద సుమారు 1,84,660 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వడ్డీ రాయితీ (పావలా వడ్డీ) పథకాన్ని రెండేళ్లుగా అమలు చేయడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రాయితీ పాత విధానంలో రూ.2 లక్షల రుణంకు తీసుకున్న రైతు రూ.4 వేలు వడ్డీ చెల్లించేవారు. నూతన విధానంతో రూ.14 వేలు చెలించాల్సి వస్తోది. మిరప సాగుకు చేసే రైతులకు ఎకరాకు రూ.80వేలు రుణం బ్యాంకులు ఇస్తున్నాయి. రెండెకరాలు మిరప సాగు చేసే రైతులు రూ.1.60 లక్షలు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారు. ఇలా రూ.లక్ష కంటే అధికంగా రుణం తీసుకుంటే సున్నా వడ్డీ పథకం అమలు కాదు. రూ.లక్షకు పైగా రుణం తీసుకుకే రైతుల సంఖ్య అధికంగానే ఉంది. వీరందరికీ పావలా వడ్డీ పథకాన్ని ప్రభుత్వాలు అమలు చేయక పోతుండటంతో రైతులు బ్యాంకుల్లో చేసిన రుణాలకు వడ్డీ పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


గతంలో ఇలా ఉండేది..

రూ.లక్ష దాటిన రూ.3 లక్షలలోపు పంట రుణాలకు రెండేళ్ళ కిందట వరకు వడ్డీ రాయితీ అమల్లో ఉంది. రైతు 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతం, కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ రాయితీ పథకానికి చెల్లించేవారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులేత్తేయడంతో రైతులే 7 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రూ.3 లక్షల పంట రుణానికి గతంలో సుమారు రూ 6 వేలు వడ్డీ కింద చెల్లించేవారు. ప్రస్తుతం వడ్డీ రాయితీ అమలు కాకపోవడంతో రైతులు రూ.3 లక్షల రుణానికి రూ.21 వేలు వడ్డీ చెల్లించాల్సి వస్తుండటంతో  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నా వారి మొర ఆలకించే పాలకులు కరువయ్యారు. నూతన పంట రుణాల విధానం రైతులను ఆర్థిక ఇబ్బందులోకి నెట్టి వేస్తోంది. ఓ వైపు ఇస్తూ మరో వైపు వడ్డీ రాయితీ అమలు చేయకుండా లాగేసుకుంటున్నదని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఈ.రాంబాబును వడ్డీ రాయితీపై బుధవారం వివరణ అడగ్గా ఈ పథకం గత ఏడాది, ఈ ఏడాది అమలు కాలేదని చెప్పారు. 

Updated Date - 2021-10-28T05:58:38+05:30 IST