డల్లాస్‌లో సిరివెన్నెలకు ఎన్నారై సంఘాల అశ్రునివాళి

ABN , First Publish Date - 2021-12-04T17:14:52+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆటా, నాటా, నాట్స్, టి.టి.ఎ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ చేంబోలు సిరివెన్నెల సీతారామశాస్త్రికి డల్లాస్‌లోని సాహితీ మిత్రులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

డల్లాస్‌లో సిరివెన్నెలకు ఎన్నారై సంఘాల అశ్రునివాళి

డల్లాస్‌లో తానా, ఆటా, నాటా, నాట్స్, టి. టి.ఎ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అశ్రునివాళి

డల్లాస్‌, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆటా, నాటా, నాట్స్, టి.టి.ఎ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ చేంబోలు సిరివెన్నెల సీతారామశాస్త్రికి డల్లాస్‌లోని సాహితీ మిత్రులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించి అందరం ఇలా సిరివెన్నెల సంతాప సభలో కలుసుకోవడం బాధాకరం అన్నారు. సినీ, సాహిత్యరంగానికి ఆయన చేసిన కృషి మరువ లేనిదని, వారి ఆత్మకిశాంతి చేకూరాలన్నారు. అలాగే ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తేలియజేశారు.


నాటా ఉత్తరాధ్యక్షులు డా.శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి మాట్లాడుతూ సిరివెన్నెల మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక మంచి రచయిత, సాహితీ వేత్తని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని కోరారు. తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ సిరివెన్నెల తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని తెలిపారు. బావగారూ అని ఆత్మీయంగా పలకరించేవారని, ఆ పిలుపు ఇలా అర్ధాంతరంగా, శాశ్వతంగా దూరం అవుతుందని వూహించలేదని అన్నారు. 


సిరివెన్నెలకు సమీప బంధువు, అతి సన్నిహితులైన యాజి జయంతి తాను విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నప్పటి నుండి వారితో గడిపిన రోజులు గుర్తుచేసుకుని ఆవేదన చెందారు. డల్లాస్ ఎప్పుడు వచ్చినా వారి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. "మురారి" సినిమా పాటలు సిరివెన్నెల తమ ఇంట్లో బస చేసినప్పుడే రాశారని భీంశంకర్ రావ్ తెలిపారు. దేవర అంటూ వారితో గడిపిన ఎన్నో మధురస్మృతులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


గత డిసెంబరులో తానా ప్రపంచసాహిత్యవేదిక ద్వారా అంతర్జాలంలో నిర్వహించిన "సినిమా పాటల్లో సాహిత్యం" అనే అంశంపై సహ సినీ గీత రచయితలు భువనచంద్ర, అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, అనంత్ శ్రీరాంలతో పాటు 3 గంటలకు పైగా సాగిన కార్యక్రమంలో సిరివెన్నెల ఎంతో ఉత్సాహంగా పాల్గొని తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెలిబుచ్చారని గుర్తు చేసుకున్నారు. తానా సంస్థతోను, వ్యక్తిగతం గాను ఎన్నో దశాబ్దాల అనుభంధం ఉన్న ఒక ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోవడం చాలా భాదాకరమని చెప్పారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


తెలుగు జాతి ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని కోల్పోయిందని సినీ, సాహిత్యరంగానికి ఇది ఒక చీకటి రోజుగా పేర్కొన్నారు. వారు లేనిలోటు తీర్చలేనిదని అభిప్రాయపడ్డారు. 2019లోవారికి "పద్మశ్రీ" వచ్చిన తరువాత అమెరికాలో వివిధ నగరాలలో అనేక సాహిత్య కార్యక్రమాలకు రూపకల్పన చేశామని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా వారు అమెరికా రావడానికి వీలుపడకపోవడం బాధాకరమని తెలిపారు. సిరివెన్నెలకు తానా సంస్థతో విడదీయరాని అనుభంధం ఉందన్నారు. అనేక మహాసభలకు ఆయన స్వాగత గీతాలు రాశారని, జీవిత సాఫల్య పురస్కారంతో సిరివెన్నెలను తానా సన్మానించిందని ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకున్నారు.


శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చిన సత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, యుగంధర చార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డా. కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డా. విశ్వనాధం పులిగండ్ల, గీత, వేణు దమ్మన, ఎన్.ఎం.ఎస్ రెడ్డి, బసివి ఆయులూరి తదితర ప్రవాస భారతీయులు బాధాతప్తహృదయాలతో “సిరివెన్నెల”తో వారికున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు. అక్షరయోధుడు, అమరజీవి సిరివెన్నెల మన మధ్యలో లేకపొయినా వారు మనకు అందించిన సాహిత్యం, తెలుగు సినిమాలున్నంత వరకు అజరామరంగా నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. మైత్రి రెస్టారెంట్ వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు. అందరూ సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడంతో కార్యక్రమం ముగిసింది.






Updated Date - 2021-12-04T17:14:52+05:30 IST