కరోనా తరువాత భారత్‌కు తిరిగొచ్చిన NRIలకు కొత్త చిక్కులు..!

ABN , First Publish Date - 2022-04-30T03:15:56+05:30 IST

విదేశాల్లో కరోనా టీకాలు తీసుకుని భారత్‌‌కు తిరిగొచ్చిన ఎన్నారైలు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు.

కరోనా తరువాత భారత్‌కు తిరిగొచ్చిన NRIలకు కొత్త చిక్కులు..!

ఎన్నారై డెస్క్: విదేశాల్లో కరోనా టీకాలు తీసుకుని భారత్‌‌కు తిరిగొచ్చిన ఎన్నారైలు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. స్వదేశంలో బూస్టర్ ‌టీకా తీసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఫైజర్, మోడర్నా టీకాలను తీసుకున్న వారితో పాటూ ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికీ ఈ అవస్థ తప్పట్లేదు. ఆస్ట్రాజెనెకా టీకా.. భారత్‌లో కొవిషీల్డ్ పేరిట అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. విదేశీ టీకాలు తీసుకున్న విషయాన్ని కొవిన్ పోర్టల్‌లో పొందుపరిచే మార్గం లేకే  వ్యా్క్సినేషన్ సెంటర్ సిబ్బంది తమను తిప్పి పంపించినట్టు ముంబైకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ తెలిపారు.


‘‘గతేడాది మా అమ్మ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆస్ట్రాజెనెకా టీకా రెండు డోసులనూ తీసుకుంది. ఆ తరువాత ఇండియాకు తిరిగొచ్చింది. ఇప్పుడు ఆమెకు బూస్టర్ డోసు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. దీంతో.. మేము స్థానిక ఆస్పత్రికి వెళ్లగా బూస్టర్ ఇవ్వడం కుదరదని అక్కడి సిబ్బంది చెప్పారు. ఆస్ట్రేలియాలో తీసుకున్న టీకా వివరాలు కొవిన్‌లో అప్‌లోడ్ చేయడం కుదరకపోవడమే ఇందుకు కారణమన్నారు’’ అంటూ ఆయన తన సమస్యను వివరించారు. 


ఇక ఆయన అత్త కూడా ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. కెనడాలో ఉండగా ఫైజర్ టీకా తీసుకున్న ఆమె ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చారు. ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్, కొవ్యాక్జిన్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. కానీ.. కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకారం మొదట్లో ఏ టీకాను తీసుకుంటే అదే టీకాను బూస్టర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే హోమోలాగస్ విధానం అంటారు. దీంతో.. ఆమె కూడా బూస్టర్ టీకా ఎలా తీసుకోవాలో తెలీక అవస్థ పడుతున్నారు. విదేశీ టీకా సర్టిఫికేట్లతో భారత్‌లో బూస్టర్ డోసు లభించేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తుతం ఎన్నారైలు కోరుతున్నారు. 


అయితే.. ఈ సమస్య తమ దృష్టికి వచ్చినట్టు కేంద్ర వైద్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.  కేవలం కొందరి ప్రయోజనం కోసమని విదేశీ టీకాలను దిగుమతి చేసుకోలేమని కూడా ఆ అధికారి చెప్పారు. అయితే.. ఈ సమస్యపై త్వరలో ఉన్నతాధికారులు చర్చిస్తారని పేర్కొన్నారు.  ఇక రష్యా టీకా స్పుత్నిక్ విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. స్పుత్నిక్ బూస్టర్ డోసుల గురించి ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చేయకపోవడం అయోమయానికి దారి తీస్తోంది. 

Updated Date - 2022-04-30T03:15:56+05:30 IST