విదేశాల్లో పిల్లలు.. టెన్షన్‌లో తల్లిదండ్రులు.. కలవరిస్తూ.. రోజూ పలకరిస్తూ..

ABN , First Publish Date - 2020-03-31T18:28:29+05:30 IST

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనిని నియంత్రించేందుకు అన్ని దేశాలు శ్రమిస్తున్నాయి. మన దేశంలో లాగే అన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. మన దేశ పరిస్థితి ఒకింత నయం. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత మేరకు నియంత్రణలో ఉన్నట్టు కనిపిస్తోంది.

విదేశాల్లో పిల్లలు.. టెన్షన్‌లో తల్లిదండ్రులు.. కలవరిస్తూ.. రోజూ పలకరిస్తూ..

ఇతర దేశాల్లో ఉన్న పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన

కరోనా ప్రభావంతో ప్రపంచమంతటా లాక్‌డౌన్‌

కలవరంతో నిద్రలేని రాత్రులు.. రోజూ ఫోన్‌లో వాకబు..

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆవేదన

తమ వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కన్నీళ్లు

కరోనా మహమ్మారి వ్యాప్తిపై ఎన్నారైల తల్లిదండ్రుల్లో గుబులు


హన్మకొండ, వరంగల్ (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనిని నియంత్రించేందుకు అన్ని దేశాలు శ్రమిస్తున్నాయి. మన దేశంలో లాగే అన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. మన దేశ పరిస్థితి ఒకింత నయం. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి  కొంత మేరకు నియంత్రణలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో  ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లల పట్ల ఇక్కడున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది వరకైతే ఏదైనా దేశంలో విపత్తు జరిగితే ఆ దేశంలో ఉన్న తమ పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. 


ఒక దేశం అని కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది. మృత్యుఘంటికలను మోగిస్తోంది. ఎంతో  అభివృద్ధి చెందినవి అనుకుంటున్న ఆమెరికా, ఇటలీ, స్పేయిన్‌ వంటి దేశాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికా సైతం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన లేదా ఉన్నత చదువులు చదువుకుంటున్న తమ పిల్లల గురించి ఇక్కడి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు కలవరపడుతుండడం సహజం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఇదే  పరిస్థితి కనిపిస్తోంది.


ఎక్కువ సంఖ్యలో..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఎక్కువ  మంది విదేశాలకు వెళ్ళి అక్కడ రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి అందులోనూ వరంగల్‌ నగరం నుంచి వెళ్ళిన వారి సంఖ్య మరీ ఎక్కవగా ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి  అమెరికాతో సహా వివిధ దేశాలక వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, ఉన్నత పదవులను నిర్వహిస్తున్నవారు, పలు పేరున్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుతున్న వారు, ఇతరత్రా వృత్తుల్లో కొనసాగుతున్నవారు 4.72 లక్షల మంది వరకు ఉంటారని పోలీసు, ఇమిగ్రేషన్‌ విభాగం వద్ద నమోదైన గణాంకాలను బట్టి తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది అంటే అమెరికాలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానం అస్ట్రేలియా, లండన్‌, దుబాయి, సింగపూర్‌, స్విట్జర్‌లాండ్‌, న్యూజిలాండ్‌ దేశాలకు దుక్కుతుంది.


కునుకు లేదు

కరోనా వ్యాప్తి విస్తృతమైన తర్వాత వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాల్లోని ఎన్నారై తల్లిదండ్రులకు కునుకులేకుండా పోయింది. విదేశాల్లో తమ పిల్లలు ఎలా ఉన్నారో? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో? ఎలా ఉంటున్నారో? కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో? లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఇళ్ళలోనే స్వీయనిర్బంధంలో ఉంటున్నారో లేదో, ఆర్ధికంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారో? అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానికంగానే తాము ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు అక్కడ ఎలా ఉందోనని కలవరపడుతున్నారు. విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ప్రతీ రోజు ఉదయం సాయంత్రం ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. వారి గురించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఉండలేని పరిస్థితి ఎదురైతే స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కూడా లేకపోవడం తల్లిదండ్రులను మరింత కుంగదీస్తోంది. మానసికంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 


భయం..భయంగా..

టీవీలో ఆయా దేశాల్లో కరోనా విస్పోటనం గురించి వస్తున్న వార్తలను చూసిన తర్వాత వారు మరింత భయందోళనకు గురవుతున్నారు. బతుకుదెరువు కోసం పరాయి దేశాలకు వలసి వెళ్ళిన తమ పిల్లలు ఇలా కష్టాల్లో చిక్కుకోవడం చూసి తట్టుకోలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు. అక్కడ ఏదైనా జరిగితే కనీసం ఆదుకునే స్థితిలో కూడా ఆదేశాలు లేవని తెలిసి బెంబేలెత్తుతున్నారు. తమ పిల్లలకు ఏమి కాకూడదని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. పిల్లలతో మొబైల్‌ వీడియోకాల్‌లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా పదే పదే హెచ్చరిస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గేవరకు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు.  


నిత్యావసరాలు దొరకడం లేదట...

మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని, ఇంట్లో నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్టు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు.   

- ఆడెపు రవీందర్‌, వరంగల్‌


ఇంటినుంచే పనిచేస్తున్నాడు...

మా పెద్దబ్బాయి శ్రావణ్‌ అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్నాడు.  ప్రతీ రోజు రెండు మూడు సార్లు ఫోన్‌ చేసి పరిస్థితి ఎలా ఉందో కనుక్కొంటున్నాను. ఇంటి నుంచే పని చేస్తున్నట్టు చెబుతున్నాడు.

- మిట్టపెల్లి రాజేశం, కమలాపూర్‌ 


అక్కడే చిక్కుకుపోయింది...

మా అమ్మాయి ఆకాంక్ష ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతోంది. విమానాలు లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయింది.  ప్రతీరోజు వీడియో కాల్స్‌ ద్వారా క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాం.

- రావెల రవి , జనగామ


మా అమ్మాయి బాధపడుతోంది...

మా అమ్మాయి మడిపెల్లి స్రవంతి, అల్లుడు శ్రీనాథ్‌ గత 10 సంవత్సరాలుగా అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నారు. ఉద్యోగరీత్యావెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. వారికి ఇద్దరు పిల్లలు. కరోనా అమెరికాలో ఎక్కువగా ఉండడంతో మా అమ్మాయి, అల్లుడు వారి పిల్లలు ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతున్నాము. గత 15 రోజులుగా అక్కడి పరిస్థితి బాగా లేదని మా కూతురు ఫోన్‌ చేసి బాధపడుతోంది. నిత్యావసర వస్తువులు దొరికే పరిస్థితి లేదట. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా తీసుకోవాలంటే భయమేసున్నదట. రోజు రోజుకు ఆమెరికాలో పరిస్థితి క్లిష్టంగా మారుతున్నట్టు టీవీల్లో చూస్తుంటే భయమేస్తున్నది.

- నాయకపు సమ్మయ్య, వినోద, బీమారం, హన్మకొండ


వార్తలు చూస్తుంటే భయమేస్తోంది..

మా అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఆమెరికాలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయి రాకేష్‌ ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపాలో, అమ్మాయి రజని న్యూజెర్సీలోని డేటన్‌ సిటీలో ఉంటున్నారు. అమెరికాను కరోనా కుదిపేస్తున్నట్టు పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తలను చూస్తుంటే భయం కలుగుతోంది.  పిల్లలిద్దరు అక్కడ ఎలా ఉంటున్నారోనని ఆందోళన చెందుతున్నాము. వారిలో రోజూ మాట్లాడుతున్నా టెన్షన్‌ తగ్గడం లేదు. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని, ఇంట్లో నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్టు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. 

- ఆడెపు రవీందర్‌ , శాంతినగర్‌, బ్యాంకు కాలనీ-2, వరంగల్‌

Updated Date - 2020-03-31T18:28:29+05:30 IST