భారత్‌లో MBBS చేసేందుకు ఆసక్తి చూపని NRIలు.. దీనికి ప్రధాన కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-03-03T22:43:11+05:30 IST

భారత్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు ఎన్నారైలు ఆసక్తి చూపడం లేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బాబా ఫరిద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(బీఎఫ్‌యూహెచ్ఎస్) తాజాగా వెల్లడించిన నివేదికనే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూ

భారత్‌లో MBBS చేసేందుకు ఆసక్తి చూపని NRIలు.. దీనికి ప్రధాన కారణం ఇదే..

ఎన్నారై డెస్క్: భారత్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు ఎన్నారైలు ఆసక్తి చూపడం లేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బాబా ఫరిద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(బీఎఫ్‌యూహెచ్ఎస్) తాజాగా వెల్లడించిన నివేదికనే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌లో మొత్తం 25 మెడికల్, డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లోని సుమారు 353 సీట్లను ఎన్నారై కోటాకు కేటాయించారు. అయితే 2021-22 విద్యా సంవత్సరానికిగానూ ఈ సీట్ల భర్తీ కోసం కొద్ది రోజుల క్రితం కౌన్సెలింగ్ జరిగింది. కానీ ఎన్నారై విద్యార్థుల నుంచి ఆశించిన మొత్తంలో స్పందన రాలేదు. ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్ పూర్తియ్యేసరికి కేవలం 37 సీట్లు మాత్రమే భర్తీ కావడంతో 316 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో కూడా కేవలం నాలుగు అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్టు బీఎఫ్‌యూహెచ్‌ఎస్ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.





ఎన్నారై విద్యార్థులు ఇక్కడ ఎంబీబీఎస్ చేసేందుకు ఆసక్తి చూపకపోవడానికి గల ప్రధాన కారణం కోర్సు ఫీజే అని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అభిప్రాయపడ్డారు. కాగా.. ఎన్నారై కోటా కింద ఒక విద్యార్థి ఎంబీబీఎస్ చేసేందుకు సుమారు కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే డెంటల్ కోర్సు చదివేందుకు విద్యార్థులకు దాదాపు రూ.50లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ విషయాన్ని బీఎఫ్‌యూహెచ్‌ఎస్ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ఎస్ గిల్ స్పష్టం చేశారు. తాను వైస్ ఛాన్సలర్‌గా పని చేస్తున్న సమయంలోనే ఎన్నారై కోటా‌కు సంబంధించిన ఫీజులు భారీ మొత్తంలో పెరిగినట్టు పేర్కొన్నారు. అప్పట్లో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేసినట్టు గుర్తు చేసుకున్నారు. అధిక మొత్తంలో ఫీజులు భరించలేక.. తమ పిల్లలను వెస్ట్రన్ కంట్రీస్‌‌‌‌లో ఎంబీబీఎస్ చదివించేందుకు మొగ్గు చూపినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్ వంటి దేశాల్లో రూ.30లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయవచ్చని తెలిపారు. 


భారత్‌లోని వైద్య విద్య కోర్సుల ఫీజులు ఎన్నారై విద్యార్థులకే కాకుండా సాధారణ విద్యార్థులకు కూడా తలనొప్పిగా మారాయి. దీంతో పెద్ద మొత్తంలో భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేందుకు తరలి వెళ్తున్నారు. భారత ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం సుమారు 1.07లక్షల మంది భారతీయ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు అభ్యసిస్తున్నారు. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. చైనాలో-23,000; ఉక్రెయిన్-18000; రష్యా-16,500; ఫిలిప్పీన్స్-15,000; కిర్గిజిస్తాన్-10,000; జార్జియా-7,500; బంగ్లాదేశ్-5,200; కజకిస్థాన్-5,200; పోలాండ్-4000; అమెరికాలో-3000 మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.


Updated Date - 2022-03-03T22:43:11+05:30 IST