యూఏఈ NRI ల కొత్త ట్రెండ్....ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా..

ABN , First Publish Date - 2022-07-17T00:01:45+05:30 IST

గల్ఫ్ అంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది చమురు బావులే..! అందుకు తగ్గట్టే..అక్కడ ఇంధన ధరలు మంచినీళ్ల కంటే తక్కువ! కానీ ఇదంతా గతం.. ఇప్పుడు..

యూఏఈ NRI ల కొత్త ట్రెండ్....ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా..

ఎన్నారై డెస్క్: గల్ఫ్ అంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది చమురు బావులే..! అందుకు తగ్గట్టే..అక్కడ ఇంధన ధరలు మంచినీళ్ల కంటే తక్కువ! కానీ ఇదంతా గతం.. ఇప్పుడు యూఏఈలో(UAE) చమురు ధరలు స్థానికులకూ చుక్కలు చూపిస్తున్నాయి. గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ సృష్టిస్తున్న అనిశ్చితి ఒకవైపు.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తప్పవన్న అంచనాలు మరోవైపు.. వెరసి ఇంధన ధరలు అమాంతం పెరిగేలా చేశాయి. ఇక ధరాభారం నుంచి తప్పించుకునేందుకు ఎన్నారైలూ(NRI)  కొత్త బాట పడుతున్నారు. విద్యుత్ కార్లు(Electric cars), హైబ్రీడ్ కార్ల(Hybrid cars) వైపు మొగ్గు చూపుతున్నారు. 


యూఏఈలో ముప్ఫై ఏళ్లుగా నివసిస్తున్న ప్రవాసీ భారతీయుడు డా. అష్రాఫ్ ఇటీవల ఇంధన ధరలు తట్టుకోలేక తన పెట్రోల్ కారును అమ్మేశారు. ‘‘ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 4.66 దిర్హామ్స్( సుమారు రూ.100). ఇలాంటి రేట్లు నేను మునుపెన్నడూ చూడలేదు. ఈ రేట్లను భరించడం కష్టం. అందుకే.. నేను నా నిస్సాన్ కారును అమ్మేసి.. టెస్లా విద్యుత్ కారును కొనుక్కున్నా’’ అని ఆయన చెప్పారు. అధికాదాయం ఉన్న ఎన్నారైలు ఇలా విద్యుత్ కార్లవైపు మళ్లుతుంటే.. మధ్యతరగతికి చెందిన వారు వీలైనంతగా ఇంధన ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించడం లేదా.. ఇంధన ఖర్చులు ఇతరులతో పంచుకునేందుకు వీలుగా కార్‌పూలింగ్‌ను ఆశ్రయించడం చేస్తున్నారని లీగల్ కన్సల్టెంట్ రాజేశ్ తెలిపారు. 


భవిష్యత్తులో పెట్రోల్ ధరలు 7 దిర్హామ్స్ దాటిపోతాయన్న అంచనాల కారణంగా కార్పొరేట్లు కూడా సాంప్రదాయిక ఇంధన ఆధారిత వాహనాలను వదిలించుకునే పనిలోపడ్డారు. అనేక ట్రావెల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు విద్యుత్ వాహనాలు లేదా హైబ్రీడ్ వాహనాలు కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం కూడా విద్యుత్ వాహన రంగాన్ని ప్రోత్సహిస్తుండటంతో.. దుబాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్లు అనేకం ఏర్పాటవుతున్నాయి. 

Updated Date - 2022-07-17T00:01:45+05:30 IST