చైనా దేశస్థురాలిని కాపాడబోయి.. లండన్‌లో భారత యువతి..

ABN , First Publish Date - 2020-02-25T17:29:16+05:30 IST

కరోనా మహమ్మారి చైనా ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. చైనాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడ్డ చైనీయులకు కూడా ఈ వైరస్ శాపంగా మారింది. ప్రపంచదేశాలలో చైనీయులు ఎక్కడ కనిపించినా.. స్థానికులు వారిపై దాడికి దిగుతున్నారు.

చైనా దేశస్థురాలిని కాపాడబోయి.. లండన్‌లో భారత యువతి..

లండన్: కరోనా మహమ్మారి చైనా ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. చైనాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడ్డ చైనీయులకు కూడా ఈ వైరస్ శాపంగా మారింది. ప్రపంచదేశాలలో చైనీయులు ఎక్కడ కనిపించినా.. స్థానికులు వారిపై దాడికి దిగుతున్నారు. వారిపై వివక్ష చూపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు. తాజాగా.. ఇంగ్లాండ్‌లో మెండీ(28) అనే చైనా దేశస్థురాలిని తన దేశానికి వెళ్లిపోమంటూ కొంతమంది దుండగులు ఆమెపై దాడికి దిగారు. ఇదే సమయంలో మెండీని కాపాడబోయిన భారత యువతిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మీరా(29) అనే భారత యువతి ఈ దాడిలో స్పృహ కోల్పోగా.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మీరా.. మెండీ, ఇతర స్నేహితులతో కలిసి లండన్‌లోని మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో తన పుట్టినరోజు వేడుకలను చేసుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో దాదాపు నాలుగు లక్షల మంది చైనీయులు నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా.. చైనాలో ఇప్పటివరకు కొవిడ్-19 కారణంగా 2500కు పైగా మరణించారు. 77 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. చైనాతో పాటు 25కు పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది.

Updated Date - 2020-02-25T17:29:16+05:30 IST